కుటుంబం సహా వ్యక్తి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

కుటుంబం సహా వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Apr 4 2026 7:43 AM | Updated on Apr 4 2026 7:43 AM

● బంధువులకు సమాచారం ఇచ్చిన భార్య ● సకాలంలో కాపాడిన రూరల్‌ పోలీసులు

నరసరావుపేట రూరల్‌: పోలీసుల అప్రమత్తత నలుగురి ప్రాణాలను రక్షించింది. ఓ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు సకాలంలో స్పందించి వారిని రక్షించారు. వివరాలు.. దుర్గి మండల కేంద్రానికి చెందిన శ్రీపతి అమరేంద్ర , త్రివేణి దంపతులు వారి కుమారుడు, కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని శుక్రవారం రాత్రి రూరల్‌ పోలీసులకు సమాచారం అందింది. సంతమాగులూరు రోడ్డు నుంచి నరసరావుపేట వైపు కారులో వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. గుంటూరు రోడ్డులోని డంపింగ్‌ యార్డ్‌ సమీపంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి దగ్గర మీరు ప్రయాణిస్తున్న కారును పోలీసులు గుర్తించారు. రూరల్‌ ఎస్‌ఐ కిషోర్‌ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. తాము ఆత్మహత్యకు పాల్పడటం లేదని ముందు బకాయించిన దంపతులు పోలీసులు కౌన్సెలింగ్‌తో నిజాన్ని అంగీకరించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు ఒప్పుకొన్నారు. రూరల్‌ ఎస్‌ఐ కిషోర్‌ మాట్లాడుతూ దుర్గి నుంచి బయలుదేరిన అమరేంద్ర, త్రివేణి దంపతులు సంతమాగులూరులో తన స్నేహితుని వద్ద నుంచి కారు తీసుకున్నారని తెలిపారు. అందరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని త్రివేణితో భర్త అమరేంద్ర చెప్పడంతో అప్రమత్తమైన ఆమె ఈ విషయాన్ని తన మామ చందుకి ఫోన్‌ ద్వారా తెలియజేసిందన్నారు. చందు ఇచ్చిన సమాచారంతో అమరేంద్ర దంపతులు ప్రయాణిస్తున్న కారును గుర్తించి వారిని రక్షించినట్లు వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement