సినీ,రంగస్థల నటులు, దర్శకులు ఉప్పలూరి సుబ్బరాయశర్మ ఉప్పలూరి సుబ్బరాయశర్మకు సుందరయ్య పురస్కారం అందజేత ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణకు ఘన సన్మానం
యడ్లపాడు: తన యావదాస్తిని పేదల కోసం త్యాగం చేసిన నిష్కళంక నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య పేరుతో పురస్కారం అందుకోవడం అదృష్టం, అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చిందని సినీ, రంగస్థల నటులు, దర్శకులు ఉప్పలూరి సుబ్బరాయశర్మ అన్నారు. యడ్లపాడు సుందరయ్య కళానిలయం నాటికల పోటీల తొలిరోజు కార్యక్రమంలో ఆయనకు రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ చేతుల మీదుగా సుందరయ్య కళానిలయం ప్రతిష్టాత్మక పురస్కారం శుక్రవారం అందించారు. అనంతరం దశాబ్దాల పాటు పౌరాణిక నాటక రంగంలో అఖండ కీర్తి గణించిన గోపాలకృష్ణను కమిటీ సభ్యులు సత్కరించారు. పురస్కార గ్రహీత సుబ్బరాయశర్మ మాట్లాడుతూ సుందరయ్య నడయాడిన ప్రాంగణంలో సన్మానం అందుకోవడం గొప్ప వరమని, కళల పట్ల ముత్తవరపు సురేష్‌బాబు కుటుంబం చూపుతున్న అంకితభావం వారి సంస్కారానికి నిదర్శనమని కొనియాడారు. ఈ కళాబంధం కలకాలం నిలవాలని కోరారు. గోపాలకృష్ణ మాట్లాడుతూ ఇటీవల గుంటూరులో అంతర్జాతీయ నాటకోత్సవాలను అద్భుతంగా నిర్వహించిన వేదిక అధ్యక్షులు సురేష్‌బాబును ప్రశంసిస్తూనే, ఆయన వెన్నంటూ ఉంటూ ప్రోత్సహిస్తున్న సీ్త్రశక్తి అరుణకుమారి పాత్రను వక్తలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అభినందించారు. అలాగే తన సుదీర్ఘ కళా ప్రస్థానంలోని మధుర స్మృతులను గుర్తుచేసుకుంటూ, సురేష్‌బాబు కుటుంబాన్ని పద్యరూపంలో అభినందించి పౌరాణిక పద్యాలతో సభికులను మంత్రముగ్ధులను చేశారు. అరుణకుమారి పరిచయ వాక్యాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి సురేష్‌బాబు అధ్యక్షత వహించగా, అనంతరం అతిథులను సన్మానించి ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ భార్గవి చౌదరి, వై రాధాకృష్ణ, ప్రజాశక్తి సంపాదకులు ఎంవీఎస్ శర్మ, గోపరాజు రమణ, నూతలపాటి కాళిదాసు, కృష్ణయ్య, ముత్తవరపు పద్మారావు, జరుగుల శంకర్రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.


