ముగిసిన అండర్‌–7 చిన్నారుల చెస్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన అండర్‌–7 చిన్నారుల చెస్‌ పోటీలు

Apr 3 2026 7:56 AM | Updated on Apr 3 2026 7:56 AM

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): జిల్లా చెస్‌ అసోసియేషన్‌, రవీంద్ర రాజు చెస్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో అండర్‌–7 బాలబాలికల చెస్‌ పోటీలు ముగిశాయి. గురువారం స్థానిక జేకేసి కళాశాల రోడ్డులోని నందనవనం 1వ లైన్‌లోని అజయ్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన పోటీల్లో బాలురల్లో నితీష్‌ అగస్త్య ఓసూరి, గొల్లా శర్వానంద్‌ రామ్‌లు ప్రథమ, ద్వితీయ స్థానాలు గెలుపొందగా బాలికల విభాగంలో పామర్తి గాయత్రి ధన్యశ్రీ, పగడాల నిషితలు ప్రధమ, ద్వితీయ స్థానాలు గెలుపొందారని చెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు చల్లా రవీంద్రరాజు తెలిపారు. ఈ నలుగురు చిన్నారులు శనివారం ఏలూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చిన్నారులకు రవీంద్రరాజు బహుమతులు ప్రధానం చేశారు.

భవనం పై నుండి జారిపడిన మెడికల్‌ విద్యార్థి

మంగళగిరి టౌన్‌: భవనంపై నుంచి మెడికల్‌ విద్యార్థి జారిపడి తీవ్ర గాయాలైన ఘటన మంగళగిరి ఎన్నారై మెడికల్‌ కళాశాలలో గురువారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు మంగళగిరి మండలం చిన కాకానిలోని ఎన్నారై మెడికల్‌ కళాశాలలో అభిమన్యు మెడిసిన్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మధ్యాహ్నం కొన్ని తరగతులు ముగిసిన అనంతరం బ్రేక్‌ టైంలో థర్డ్‌ ఫ్లోర్‌లోని బాల్కనీ వద్దకు చేరుకున్నాడు. అనుకోకుండా భవనంపై నుంచి జారీ కింద పడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఎన్నారై వైద్యశాలలో చికిత్స నిమిత్తం తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం అభిమన్యు వెన్నెముకకు తీవ్రగాయమైందని, ప్రమాదం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

రేషన్‌ బియ్యం తరలిస్తున్న వాహనం పట్టివేత

నగరంపాలెం: పాతగుంటూరు శ్రీఆంజనేయస్వామి గుడి వద్ద గురువారం ఉదయం అనధికారికంగా పీడీఎస్‌ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని జిల్లా పోలీస్‌ టాస్క్‌ఫోర్స్‌ పట్టుకున్నారు. ఈ మేరకు జేకేసీ రోడ్డుకి చెందిన వాహన డ్రైవర్‌ వి.చంద్రశేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. మిర్చియార్డుకి చెందిన షేక్‌.అలీకి చెందిన యాభై కిలోల 55 బస్తాలుగా గుర్తించారు. అనంతరం డ్రైవర్‌ని, 2.75 టన్నుల 55 బస్తాలను పాతగుంటూరు పోలీసులకు అప్పగించారు.

చీరలు దొంగలిస్తూ

పట్టుబడిన మహిళలు

నగరంపాలెం: వస్త్ర దుకాణంలో చీరలు దొంగలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలను నిర్వాహకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మంగళగిరిరోడ్డు ప్రధాన రహదారిలోని వైష్ణవి కాంప్లెక్స్‌లో వస్త్ర దుకాణాలు నెలకొన్నాయి. గురువారం మధ్యాహ్న వేళ అందులోని ఓ దుకాణంలో చీరలు కొనుగోలు చేసేందుకు పలువురు మహిళలు వచ్చారు. వస్త్రాలను చూసే క్రమంలో చీరలను దొంగలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలను వస్త్ర దుకాణదారుడు సత్యనారాయణ, మిగతా దుకాణాల నిర్వాహకులు చాకచాక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఇద్దర్ని పాతగుంటూరు పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన ఇద్దరి మహిళల వద్ద 16 చీరలు గుర్తించగా, దుకాణదారుడు సత్యనారాయణ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement