గుంటూరు మెడికల్: రెండు తెలుగు రాష్ట్రాల్లో పేదల పెద్దాసుపత్రిగా పేరుగడించిన గుంటూరు జీజీహెచ్‌లో ఏసీలు పనిచేయక పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క ఎండాకాలం ప్రారంభమై ఏప్రిల్‌లో ఎండలు మండిపోతున్నాయి. ఆపరేషన్ థియేటర్స్, వార్డుల్లో ఏసీలు పనిచేయక రోగులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. రోగులకు వైద్య సేవలు అందించే వైద్యులు, వైద్య సిబ్బంది సైతం ఏసీలు పనిచేయక ఉక్కపోతతో చెమటోడ్చుతున్నారు. ఏసీల రిపేర్లు చేసే టెక్నీషియన్ ఒక్కరు కూడా ఆస్పత్రిలో లేరు. ఏసీల కాంట్రాక్టర్ సైతం కాంట్రాక్ట్ కాల పరిమితి దాటిపోవటంతో పత్తా లేకుండా పోయాడు. అయినప్పటికీ కాంట్రాక్టర్‌కు రూ.లక్షల బిల్లులు చెల్లించేందుకు ఆస్పత్రి అధికారులు రంగం సిద్ధం చేయటం తీవ్ర విమర్శలకు తావునిస్తోంది.
గుండెజబ్బు రోగులకు అవస్థలు....
జీజీహెచ్‌లో గుండె జబ్బు రోగులకు అవస్థలు తప్పడం లేదు. ప్రతిరోజూ ఇబ్బంది పడేవారు కొంత ఉపశమనం కోసం వస్తే ఏసీలు పనిచేయక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కార్డియోథొరాసిక్ సర్జరీ ఆపరేషన్ థియేటర్‌లో సైతం ఏసీలు పనిచేయటం లేదు. ఏసీల రిపేర్లతో గుండె ఆపరేషన్లు చేసేందుకు వైద్యులు నానా అగచాట్లు పడుతున్నారు. ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి. మరోపక్క ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు గదిలో ఏసీలు పనిచేయక ఊపిరాడక నానా అగచాట్లు పడుతున్నారు. గుండె జబ్బు రోగులకు సరిపడ గాలి, వెలుతురు లేని పక్షంలో ఊపిరి అందక ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు తీవ్ర నిర్లక్ష్య ధోరణితో ఏసీలు రిపేర్లు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోతున్నారు.
అత్యవసర విభాగంలోనూ...
జీజీహెచ్‌కు గుండెకాయ మాదిరిగా ఉండే అత్యవసర వైద్య సేవల విభాగం (ఎమర్జన్సీ వార్డు)లో ఏసీలు పనిచేయక రోడ్డు ప్రమాద బాధితులు, అత్యవసర వైద్యసేవల కోసం తీవ్ర అనారోగ్యంతో వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండలు మండుతూ ఉండటంతో మధ్యాహ్నం సమయంలో వార్డులో ఉండి చికిత్స పొందాలంటే ఉడికిపోవాల్సిందే. వైద్యులు, వైద్య సిబ్బంది సైతం ఎమర్జన్సీ వార్డులో వైద్యసేవలు అందించేందుకు చెమటోడ్చుతున్నారు. కీలకమైన వైద్య విభాగాల్లో, ఆపరేషన్ థియేటర్స్‌లో ఏసీలు పనిచేయకపోయినా ఆస్పత్రి అధికారుల్లో ఏ మాత్రం చలనం లేకపోవటం విమర్శలకు తావు ఇస్తోంది.
ఏడాదికి రూ.40 లక్షల బిల్లులు
ఆస్పత్రిలో సుమారు 100 నుండి 125 ఏసీలు పనిచేస్తున్నాయి.గత ఏడాది కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పలు బ్యాంకులు , కంపెనీల ద్వారా సామాజిక బాధ్యతలో భాగంగా సుమారు 30 వరకు ఏసీలు ఉచితంగా జీజీహెచ్‌కు అందజేశారు. వీటి నిర్వహణ కోసం ప్రతి ఏడాది ఏసీల కాంట్రాక్టర్‌కు రూ. 35 లక్షల నుంచి రూ.40 లక్షలు చెల్లిస్తున్నారు. గత ఏడాది కాంట్రాక్టర్ సక్రమంగా పనిచేయలేదని వైద్య విభాగాధిపతులు చెప్పినా ఆస్పత్రి అధికారులు అతడికి దొడ్డిదారిలో బిల్లులు చెల్లించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఆస్పత్రిలో సుమారు మూడు నెలలుగా ఏసీ కాంట్రాక్టర్ లేరు. ఆస్పత్రిలో ఒక్క ఏసీ మెకానిక్ పోస్టు కూడా లేదు. ప్రతి ఏడాది ఏసీల కాంట్రాక్టర్‌కు ఇచ్చే రూ.40 లక్షలతో కొత్త ఏసీలు 100 వరకు కొనుక్కొని కంపెనీ వారు ఇచ్చే వారంటీతో ఏడాది నుంచి మూడేళ్లపాటు ఉచిత సర్వీసులు పొందవచ్చు. ఆసుపత్రి అధికారులకు సంబంధించిన గదుల్లో ఏసీలు బాగానే పనిచేస్తున్నాయి. రోగులకే దిక్కు లేదు.


