పేదల బియ్యం పక్కదారి | - | Sakshi
Sakshi News home page

పేదల బియ్యం పక్కదారి

Apr 2 2026 7:35 AM | Updated on Apr 2 2026 7:35 AM

యథేచ్ఛగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా 10 వేల బస్తాలు చిలకలూరిపేట టూ కాకినాడ

చెక్‌పోస్టులకు ముందస్తుగా వాహనాల నంబర్లు కొమ్ముకాస్తున్న సంబంధిత అధికారులు చీరాలతోపాటు కందుకూరు, గుంటూరులో కూడా మూలాలు నోరు మెదిపితే డీలర్‌ షిప్‌ రద్దు చేస్తామని హెచ్చరిక

స్థాయిని బట్టి మామూళ్లు

నోరు మెదిపితే చర్యలు

మా బాధ్యతలు నిర్వహిస్తున్నాం

ఏడుగురు డీలర్లపై 6ఏ కేసులు

యథేచ్ఛగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

చీరాల అర్బన్‌: చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయి. అవినీతి రాజ్యమేలుతోంది. పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయి. దీనిపై నిఘా పెట్టాల్సిన సంబంధిత అధికారులు శీతకన్ను వేస్తున్నారు. దీంతో రేషన్‌ మాఫియాగా గుర్తింపు పొందిన ఓ వ్యక్తి దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అతను చీరాలతోపాటు కందుకూరు, గుంటూరులలో కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒంగోలులో ప్రజా ప్రతినిధిగా చెలామణి అవడం, చీరాల్లో కీలక నేత, యువనేతల అండ అందుకు కారణమనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి స్థాయిని బట్టి నజరానాలు అందటం బహిరంగ రహస్యాలనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

చీరాల నియోజకవర్గంలో సేకరిస్తున్న రేషన్‌ బియ్యాన్ని తొలుత చిలకలూరిపేటకు, అక్కడ నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. చెక్‌ పోస్టుల వద్ద ముందస్తుగా నల్లబజారు వ్యాపారులకు చెందిన వాహనాల నంబర్లు చెప్పి, వాటిని ఆపకుండా ఒక వ్యవస్థను తయారు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చీరాల నియోజకవర్గం నుంచి ప్రతి నెలా సుమారు 10 వేల బస్తాల రేషన్‌ బియ్యం నల్లబజారుకు తరలుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పలువురు డీలర్లు కొంతమేర కార్డుదారుల నుంచి కొనుగోలు చేయటం, మరికొంత చేతివాటంతో సేకరిస్తున్నారని చెప్పుకుంటున్నారు.

స్థానికంగా డీలర్లు వద్ద రేషన్‌ బియ్యాన్ని నల్లబజారు వ్యాపారి దివ్యాద్రి కేజీ రూ.14లకు కొనుగోలు చేస్తున్నాడు. ఆ బియ్యాన్ని చిలకలూరిపేటకు తరలిస్తున్నాడు. అక్కడ ప్రత్యేక గోతాల్లో నింపుతారు. వాటిని పెద్ద, పెద్ద టర్బోలకు లోడ్‌ చేసి, కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. పోర్టు నుంచి దక్షిణాఫ్రికా దేశాలకు తరలుతున్నాయి. ఇటీవల కాకినాడ పోర్టులో సుమారు 140 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం పట్టుబడటం గమనార్హం. చిలకలూరిపేట మిల్లర్‌కి సదరు వ్యక్తి కేజీకి రూ.24 చొప్పున చెల్లిస్తున్నాడని, మిల్లర్‌ అక్కడ నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తారని ప్రచారం జరుగుతోంది. అక్కడ మిల్లర్‌కు కేజీకి రూ.29.50 చొప్పున ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు.

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి స్థాయిని బట్టి మామూళ్లు ముడుతున్నాయి. మొదటి స్థానంలో రాజకీయ అండ కోసం కీలక నేత, యువనేతలకు పెద్ద మొత్తం అందుతోంది. తరువాత మిగిలిన వ్యవస్థల్లో ఇస్తుండటంతో వారు కూడా మౌనముద్ర దాలుస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు అందుకు దర్పణం పడుతున్నాయని ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

మా వంతు బాధ్యతలను మేం సక్రమంగా నిర్వహిస్తున్నాం. గత నెలలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను, మూడు రేషన్‌ దుకాణాలను తనిఖీ చేశాం. పెద్దగా లోపాలు లేవు. రేషన్‌ బియ్యం పక్కదారి పడుతుంటే తెలిసిన వారు మాకు సమాచారం అందించాలని కోరుతున్నాం. ఏ డీలరైనా బియ్యం బదులు డబ్బులిస్తామని ఇబ్బంది పెడుతుంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. వాటిని రికార్డు చేస్తాం. మా పరంగా ఎవరినీ ఉపేక్షించం. ఎలాంటి ప్రలోభాలకు తావివ్వం.

– చంద్రశేఖర్‌, విజిలెన్స్‌ సీఐ, గుంటూరు

గత నెలలో చీరాల్లో ఏడు రేషన్‌ షాపులను తనిఖీ చేశాం. సరుకులో వ్యత్యాసాలతో ఆయా షాపుల నిర్వహకులపై 6ఏ కేసులు నమోదు చేశాం. విజలెన్స్‌ అధికారుల బృందం కూడా ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను తనిఖీ చేశారు. రేషన్‌ సరుకుల పంపిణీ, రవాణాలో అవకతవలు జరగకుండా సక్రమంగా మా వంతు బాధ్యతలు మేం నిర్వహిస్తున్నాం.

– ఓంకార్‌,

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ, చీరాల

రేషన్‌ డీలర్లులో పలువురు పేరు మాది, ఫలితం మరొకరిదని తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే డీలర్‌గా ఉండాలంటే ఎక్కడా నోరు మెదపకూడదని, అలానే చెప్పినప్పుడు అడిగిన ఇండెంట్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలనే నిబంధన పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. కాదంటే సంబంధిత రేషన్‌ డీలర్ల దుకాణాలపై తమకు అనుకూలమైన అధికారులతో దాడులు చేయిస్తామనే బెదిరింపులు ఎదురవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అందుకు ఓ అధికారి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే బహిరంగంగా తమకు జరుగుతున్న కష్టాన్ని, నష్టాన్ని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని పలువురు డీలర్లు వాపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement