సూర్యలంకలో త్వరితగతిన అభివృద్ధి పనులు ● జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్ ఆదేశాలు
● స్వదేశీదర్శన్ 2.0 పై అధికారులతో సమీక్ష బాపట్ల టౌన్ సూర్యలంకలో స్వదేశీ దర్శన్ 2.0 నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. బాపట్ల జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పనులపై ఏపీటీడీసీ అధికారులను ఆరా తీశారు. దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నాణ్యమైన వస్తువులను వాడాలని అన్నారు. ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. తీరంలో ఎండు చేపలు అమ్మే వారిని అక్కడి నుంచి 3 రోజుల్లోపు ఖాళీ చేయించి పంచాయతీ భూమిలో షాపుల సముదాయం వద్ద అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. క్లస్టర్–2 లో రూ.6 కోట్ల పనులను ఇప్పటివరకు ఎందుకు ప్రారంభించలేదని ఆరా తీశారు. పనులు వేగవంతానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీఐఐసీ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కుల నిర్మాణం వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నిజాంపట్నం, వేటపాలెం, బాపట్ల, అమర్తలూరు మండలాలలో చేపట్టిన ఎంఎస్‌ఎంఈ పార్కుల పనులను మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మార్టూరు మండలంలోని నాగరాజు పల్లెలో కావలసిన ప్రభుత్వ భూమి కొరకు ప్రతిపాదన సమర్పించాలని ఆయన అధికారులకు సూచించారు. ఉత్పత్తి రంగాలకు వేదికగా పార్కులు నిర్మించాలన్నారు. ఈ సమావేశంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నరసింహారావు, పర్యాటక శాఖ అధికారి అలీ అస్గర్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ వై.రామకృష్ణ, జిల్లా ఐటీ మేనేజర్ గోపీనాథ్, జిల్లా అటవీశాఖ అధికారి రవిశంకర్, పరిపాలన అధికారి మల్లికార్జునరావు పాల్గొన్నారు.
బాపట్ల పట్టణంలో పిల్లల కోసం నిర్మిస్తున్న బాలవనం నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి, వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. బాపట్ల పట్టణం ప్యాడిసన్ పేటలోని గుంటూరు రోడ్డు ఫ్లైఓవర్ కింద నిర్మిస్తున్న బాలవనం పనులను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. బాలవనం ఆహ్లాదకరంగా ఉండాలన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వేగంగా నిర్మించాలని ఆదేశించారు. మునిసిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
బాలవనం త్వరితగతిన పూర్తి చేయాలి
పింఛన్లు పంపిణీ
వేమూరు: పేదలకు పింఛన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలంలోని మోపర్రు గ్రామంలో పింఛను పంపిణీ చేశారు. వృద్ధుల వద్దకు వెళ్లి బుధవారం పింఛన్లు అందజేశారు. గ్రామంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మండల పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. విద్యార్థులను చదువు గురించి, మధ్యాహ్న భోజనం పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులతో మాట్లాడారు. గ్రామంలోని ప్రజలు కొన్ని సమస్యలను అయన దృష్టికి తీసుకెళ్లారు.