150 బస్సులు.. ఫిట్‌లెస్‌ | - | Sakshi
Sakshi News home page

150 బస్సులు.. ఫిట్‌లెస్‌

Jun 4 2025 2:22 AM | Updated on Jun 4 2025 2:22 AM

150 బస్సులు.. ఫిట్‌లెస్‌

150 బస్సులు.. ఫిట్‌లెస్‌

సామర్థ్య పరీక్షలు పూర్తయినవి 198

స్కూళ్ల పునఃప్రారంభానికి దగ్గర పడుతున్న గడువు

నిబంధనల ప్రకారం ముందస్తు పరీక్షలు తప్పనిసరి

ఆసక్తి చూపని ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు

భువనగిరి : ఈ విద్యాసంవత్సరం పునఃప్రారంభానికి సమయం దగ్గరపడుతున్నా జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన బస్సులకు ఫిట్‌నెస్‌ (సామర్థ్య) పరీక్షలు చేయించుకునేందుకు యాజమాన్యాలు ఆసక్తి చూపడంలేదు. నిబంధనల ప్రకారం విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే బడి బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించి ఆర్టీఏ కార్యాలయం నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందాల్సి ఉంది. అయితే జిల్లావ్యాప్తంగా ప్రైవేట్‌ విద్యాసంస్థలకు చెందిన బస్సులు 370 వరకు ఉన్నాయి. ఇందులో 15 ఏళ్ల కాల పరిమితి దాడిన వాటితోపాటు తుక్కు కింద వెళ్లినవి దాదాపు 22 బస్సుల వరకు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం జిల్లాలో ఇప్పటి వరకు 198 బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించారు. ఇంకా 150 వరకు బస్సులు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించుకోలేదు. ఈ నెల 12న స్కూళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించుకోవడానికి ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉంది.

గతేడాది పరీక్షలు లేకుండానే..

గత ఏడాది ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించకుండానే కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు బస్సులను నడిపినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఈ సారైనా అధికారులు దృష్టిసారించి బడి బస్సులన్నింటికీ ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించి బడి బస్సులు ప్రమాదాల బారిన పడకుండా చూడాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇవీ..నిబంధనలు..

● 15 ఏళ్ల కాలపరిమితి నిండిన బస్సుల్లో విద్యార్థులను రవాణా చేయడానికి వీల్లేదు.

● ప్రతి వాహనం (ప్రతి బడి బస్సు) పూర్తి కండీషన్‌లో ఉన్నట్టు ఆర్టీఏ అధికారులు ధ్రువీకరించాలి.

● విద్యాసంస్థ పేరు, పూర్తి చిరునామా, ఫోన్‌ నంబర్‌ బస్సు ఎడమవైపు ముందు భాగంలో కనిపించేలా ఉండాలి.

● ప్రతి విద్యాసంస్థ బస్సు, ఇతర వాహనం నడిపే వ్యక్తికి ప్రతి మూడు నెలలకు ఒక్కసారి బీపీ, కంటి, మధుమేహం వంటి పరీక్షలు

చేయించుకోవాలి.

● వాహనం నడిపే డ్రైవర్‌కు ఐదు ఏళ్ల అనుభం ఉండాలి.

● బస్సుకు అత్యవసర ద్వారం ఉండాలి.

● ప్రతి వాహనంలో మంటలార్పే పరికరాలు తప్పనిసరిగా ఉండాలి.

● విద్యార్థులు బస్సును ఎక్కడం, దిగడం వంటి దృశ్యాలు డ్రైవర్‌కు కనిపించేలా అద్దం ఏర్పాటు చేసుకోవాలి.

● ప్రతి బస్సులో అటెండర్‌, విద్యార్థులు పట్టిక ఉండాలి.

● విద్యార్థులు పుస్తకాలను పెట్టుకోవడానికి ప్రత్యేకంగా విభాగాలు ఏర్పాటు చేయాలి.

ఫిట్‌నెస్‌ పరీక్షలు లేకుంటే సీజ్‌ చేస్తాం

విద్యాసంస్థలు ప్రారంభం నాటికి బడి బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలి. గడువు ముగిసిన తర్వాత పరీక్షలకు రాని బస్సులు విద్యార్థులతో రోడ్డెక్కితే సీజ్‌ చేస్తాం. చట్టప్రకారం కేసులు నమోదు చేస్తాం. ఇప్పటి వరకు ఎన్ని బస్సులు పరీక్షలకు వచ్చాయి..ఎన్ని రాలేదో మా వద్ద వివరాలు ఉన్నాయి.

– సాయికృష్ణ, జిల్లా రవాణాశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement