భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ మావుళ్లమ్మ వారి మండలి దీక్షా మాలధారణ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జునశర్మ కలశస్థాపన పూజ జరిపి, ప్రారంభించారు. 145 మంది భక్తులు దీక్షా మాలధారణ ధరించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు. అలాగే ఆలయ ఆవరణలో చండీహోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు మద్దిరాల రామలింగేశ్వరశర్మ జ్ఞాపకార్థం మనవడు మద్దిరాల రామకార్తీక్ ఇత్తడి, రాగితో తయారు చేసిన సుమారు 53 కేజీల హోమగుండాన్ని సమర్పించారు. ఈ హోమగుండాన్ని ఆలయ ప్రధాన అర్చకులు సంప్రోక్షణ జరిపి చండీహోమం చేశారు.
సుబ్బారాయుడికి ప్రత్యేక అభిషేకాలు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి మంగళవారం ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు తోలేటీ వీరభద్రశర్మ ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేక పూజలు ఇతర కార్యక్రమాలు నిర్వహించి అభిషేకాలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నిత్యన్నదాన ప్రసాదానికి సంబంధించి తగిన ఏర్పాట్లు చేశామని ఈఓ ఆర్ గంగాశ్రీదేవి తెలిపారు.
జిల్లా బాలికల క్రీడా జట్లకు 70 మంది ఎంపిక
తణుకు అర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 విభాగంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బాలికల క్రీడా జట్ల ఎంపికలు తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా జూనియర్ కళాశాలలో మంగళవారం నిర్వహించారు. చదరంగం, ఖోఖో, వాలీబాల్, యోగా, బాల్ బ్యాడ్మింటన్, టెన్నీకాయిట్, త్రోబాల్ విభాగాల్లో ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరుకాగా 70 మంది ఎంపికయ్యారని వారిలో 25 మంది ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల విద్యార్థులు ఉన్నట్లుగా ప్రిన్సిపాల్ భూపతిరాజు హిమబిందు తెలిపారు.
కళాశాల జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకట కృష్ణారావు జట్ల ఎంపికలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ జిల్లా సెక్రటరీ కె.జయరాజు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ యు.లక్ష్మీసుందరీబాయ్, ఎస్‌డీ కళాశాల ప్రిన్సిపల్ వీవీ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మావుళ్లమ్మ దీక్షాధారణ ప్రారంభం

జిల్లా బాలికల క్రీడా జట్లకు 70 మంది ఎంపిక