
పెదవేగి ఎంఈఓ–1పై విచారణకు ఆదేశం
ఏలూరు (టూటౌన్): పెదవేగి ఎంఈఓ–1 పై జాతీయ ఎస్టీ కమిషన్ విచారణకు ఆదేశించింది. పెదవేగి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామచంద్రపురంలో పనిచేస్తున్న పీఎస్ హెచ్‌ఎం జి.కృష్ణకు జూలై నెల జీతం చేయకుండా వేధించినందుకుగాను జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఆగస్టు నెలలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన జాతీయ ఎస్టీ కమిషన్ గత నెల 19న జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారికి నోటీసులు జారీ చేసింది. దీంతో ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఇటీవల పెదవేగి మండల విద్యాశాఖ అధికారి–1పై విచారణ చేసేందుకు ఏలూరు ఉప విద్యాశాఖ అధికారి ఎన్.రవీంద్ర భారతి, దెందులూరు ఎంఈఓ ఏవీఎన్‌వీ ప్రసాద్ లను విచారణ అధికారులుగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. విచారణ నివేదికను ఈ నెల 12 లోగా తమకు అందించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా నుంచి చలో విజయవాడ పోరుబాట కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తరలి వెళ్లారు. ఈ ధర్నాకు 10 వేలు పై చిలుకు హాజరవ్వగా ఒక్క ఏలూరు జిల్లా నుంచే ఈ కార్యక్రమంలో సుమారు 1000 మందికి పైగా హాజరైనట్లు నాయకులు చెబుతున్నారు. బోధనేతర పనులను బహిష్కరించడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో చైర్మన్ జి.మోహన్, సెక్రటరీ జనరల్ యం.ఆదినారాయణ, కో–చైర్మన్లు జి. వెంకటేశ్వరరావు, జి.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
దెందులూరు: హైదరాబాద్ నుంచి కురెళ్లగూడెం చేపల చెరువుకు వెళ్తున్న కోళ్ల వ్యర్థాల లారీని మంగళవారం గుండుగొలను వద్ద పట్టుకుని సీజ్ చేశామని దెందులూరు హెచ్‌సీ హమీద్ అన్నారు. ముందస్తు సమాచారంతో గుండుగొలను వద్ద లారీ పట్టుకున్నామన్నారు. ఈ నేరంతో సంబంధం ఉన్న ఐదుగురు నిందితుల పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.