
బీచ్‌కు వచ్చే సందర్శకుల రక్షణకు చర్యలు తీసుకోవాలి
భీమవరం (ప్రకాశంచౌక్): పేరుపాలెం, కేపీ పాలెం బీచ్ సందర్శకుల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బీచ్ సందర్శకుల రక్షణ ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ మైరెన్ పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ, బీచ్ సందర్శకులను అప్రమత్తం చేయడంతో పాటు, వారి భద్రతకు పటిష్టమైన చర్యలను చేపట్టాలన్నారు. పేరుపాలెం బీచ్‌లోని స్థానిక లా – ఆర్డర్ పోలీసులతో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను కూడా నిర్వహించాలని సూచించారు. పేరుపాలెం బీచ్‌లో కొత్త కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ కోసం భూమిని సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, విశాఖపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ డీఎస్పీ జి.బాలిరెడ్డి, అంతర్వేది మైరెన్ ఇన్‌స్పెక్టర్ నవీన్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
మహర్షి వాల్మీకికి నివాళులు
భీమవరం (ప్రకాశం చౌక్): రామాయణ మహా కావ్యాన్ని రచించి జాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహోన్నత వ్యక్తి మహర్షి వాల్మీకి అని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్‌ఓ బి.శివన్నారాయణ రెడ్డి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాల్మీకి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.