
గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
బుట్టాయగూడెం: గిరిజన ప్రాంతాల్లో పీఎం జన్మాన్ పథకం కింద విద్య, వైద్యం, విద్యుత్, తాగునీరు, రహదారి వంటి సదుపాయాలు మరింత మెరుగుపరిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ అధికారులను ఆదేశించారు. మండలంలోని కేఆర్‌పురం ఐటీడిఏలో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో గిరిజనులకు మంజూరు చేసి నిబంధనలపేరుతో నిలుపుదల చేసిన 26 ఇళ్లను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే తమకు సమస్యలు తెలియజేసేందుకు వచ్చిన గిరిజనులపై మర్యాదపూర్వకంగా ఉండాలని చెప్పారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పెద్దవాగు ప్రాజెక్టు మరమ్మతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి, ఇరిగేషన్ అధికారులకు ప్రతిపాదనలు పంపించామన్నారు. అనుమతులు రాగానే చర్యలు చేపడతామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో జాతీయ ఎస్టీ కమిషన్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి ఇ.సతీష్, ఐటీడిఏ పీఓ రాములు నాయక్, ఇన్‌చార్జి ఆర్‌డీఓ ముక్కంటి, పోలవరం ప్రాజెక్టు భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ సరళా వందనం తదితరులు పాల్గొన్నారు.