
చెరువు గట్లపై మృత్యు తీగలు
ప్రజల ప్రాణాలు ముఖ్యం
● నిర్లక్ష్యంతో బలవుతున్న కూలీలు
● కనీస జాగ్రత్తలు పాటించని యాజమానులు
కై కలూరు: విద్యుదాఘాతానికి చేపల చెరువులపై పొట్టకూటి కోసం పనిచేసే బడుగు జీవులు పిట్టల్లా రాలిపోతున్నారు. యజమానుల నిర్లక్ష్యంతో మృత్యు తీగలు యమపాశాలుగా మారుతున్నాయి. చెరువు నీటిలో యంత్రాలకు మరమ్మతులు చేస్తున్న సమయంలో కార్మికులు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. పశువులకు చెరువు గట్లపై గడ్డి కొస్తున్న కూలీలు గమనించక గడ్డితో పాటు విద్యుత్ వైర్లను కోస్తూ మరణిస్తున్నారు. కొల్లేరు ప్రాంతాల్లో ఇటువంటి మరణాలు నిత్యకృత్యంగా మారాయి.
ఉమ్మడి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. వీటిలో 1.80 లక్షల ఎకరాల్లో చేపలు, 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో 4,759, పశ్చిమగోదావరి జిల్లాలో 16,374 ఆక్వా విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. కై కలూరు నియోజకవర్గంలో ఆక్వా విస్తీర్ణం 84,852 ఎకరాలు కాగా.. ఆక్వా రైతులు 30,972 మంది ఉన్నారు. ఆక్వా రైతులు వాడకాన్ని బట్టి 10 హెచ్‌పీ మోటార్లును వినియోగిస్తున్నారు. రొయ్యల సాగులో నీటిలో ఆక్సిజన్ పెంచడానికి 24 గంటలు ఏరియేటర్లను వినియోగిస్తారు.
లక్షల ఎకరాల్లో చేపల చెరువులకు రోజూ మేతలు కట్టడం, యజమాని పశువులకు మేత కోయడం వంటి పనులకు పలు కుటుంబాలు చేపల చెరువులపై నివాసముంటున్నాయి. చెరువు విస్తీర్ణాన్ని బట్టి భార్యభర్తలకు నెలకు రూ.18 వేల జీతం చెల్లిస్తున్నారు. జనావాసాలకు చెరువులు దూరంగా ఉండటంతో ప్రమాదం జరిగినప్పుడు తక్షణ సాయం అందక మరణాలు ఎక్కువగా ఉన్నాయి. మోటారు చక్రాలలో కొందరు తలలు ఇరుక్కుని మరణిస్తోన్నారు. ఒడిశా, రాజస్థాన్ ప్రాంతాల నుంచి వసల కూలీలు ఎక్కువగా ఇటీవల చెరువు గట్లపై స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కుటుంబ పోషణ కోసం అధిక అడ్వాన్సు తీసుకోవడంతో పనిభారం పెరిగినా చేయక తప్పని పరిస్థితి.
ఇవి పాటించాలి
● ఆక్వా రైతులు చెరువులపై నాణ్యమైన మోటార్లు, ఫ్యాన్ సెట్టు వినియోగించాలి.
● అండర్ కేబుల్ వైరింగ్ చేసుకోవడం ఉత్తమం.
● చెరువు వద్ద కనీసం 11 అడుగుల ఎత్తులో విద్యుత్ తీగలు ఏర్పాటు చేయాలి.
● నాణ్యమైన విద్యుత్ వైర్లతో సరైన ఎర్తింగ్ ఏర్పాటు చేసి ఎంసీఏ మీటరు వినియోగించుకోవాలి.
● అవగాహన, అనుభవం లేని వ్యక్తులతో విద్యుత్ పరికరాల మరమ్మతులు చేయించవద్దు.
● విద్యుత్ లైన్లు, ట్రాన్మ్‌ఫార్మర్స్, మీటర్ల వద్ద మరమ్మతులకు విద్యుత్ శాఖ అధికారిక సిబ్బందిని మాత్రమే ఉపయోగించాలి.
● తడిగా ఉన్న పరికరాలను నేరుగా తాకరాదు. గాలులకు మీ పరిసరాలలో ఏవైనా స్తంభాలు, వైర్లు పడిపోతే వెంటనే విద్యుత్ సిబ్బందికి, సబ్ స్టేషన్‌కు తెలపాలి.
● తడి చేతులతో స్విచ్ బోర్డు ఇతర విద్యుత్ పరికరాలను తాకరాదు.
● మోటర్లకు నాణ్యమైన రేటింగ్ ఉన్న కెపాసిటర్లను వినియోగించాలి.
ఇటీవల కాలంలో ప్రమాదాలు
● కై కలూరు శివారు ఏలూరు రోడ్‌లో పొత్తూరి సుబ్బరాజు అనే యువ ఆక్వారైతు చేపల చెరువు మోటరు స్విచ్ వేస్తున్న సమయంలో విద్యుదాఘాతంతో మరణించాడు.
● కై కలూరు మండలం పెంచికలమర్రులో దుంపగడపకు చెందిన మెరుగుమల్లి శ్రీనివాసరావు విద్యుత్ వైర్లు తగిలి మరణించాడు.
● కై కలూరు మండలం నర్సాయిపాలెం పుల్లవ డ్రైయిన్ వద్ద గేలంతో చేపలు పడుతూ మోటారు వైర్లు తగిలి పశ్చిమగోదావరి జిల్లా శృంగవృక్షంకు చెందిన తానేటి మాసేన్ మృతిచెందాడు.
● నందివాడ మండలం పోలుకొండ వద్ద రొయ్యల చెరువుపై విద్యుత్ వైర్లు తగిలి వేల్పూరి గ్రామానికి చెందిన మల్లేశ్వరరావు మృతి చెందాడు.
● కై కలూరు మండలం భుజబలపట్నంలో చేపల మేతలకు సాయం చేసే క్రమంలో విద్యుత్ వైర్లు తగిలి బోయిన నాగేశ్వరరావు మృతిచెందాడు.
● కలిదిండి మండలం తాడినాడలో కట్టా రంగారావు ఆకులు కొడుతూ మృతిచెందాడు.
● మండవల్లి మండలం దయ్యంపాడులో రొయ్యల చెరువు ఏరియేటర్ల బిగిస్తూ ఘంటసాల భాను మృతి
● కలిదిండికి చెందిన సమయం సుబ్బారావు గడ్డి కోస్తూ విద్యుత్ తీగలు తగిలి మృతి.
విద్యుత్ ఎంత ఉపయోగమో అంతే ప్రమాదకరం. ఆక్వా చెరువులపై విద్యుత్ వైర్ల ఏర్పాటులో నిర్లక్ష్యం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. విద్యుత్‌శాఖ పరంగా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. చెరువు నీటిలో విద్యుత్ పరికరాలు మరమ్మత్తుల చేసే సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి.
– జీబీ.శ్రీనివాసరావు, విద్యుత్‌శాఖ ఈఈ, గుడివాడ

చెరువు గట్లపై మృత్యు తీగలు

చెరువు గట్లపై మృత్యు తీగలు

చెరువు గట్లపై మృత్యు తీగలు