
కొత్త బస్సులకు నిధులు కేటాయించాలి
తణుకు అర్బన్: ఆర్టీసీలో కొత్త బస్సుల కోసం నిధులు కేటాయించకుండా సీ్త్ర శక్తి పథకాన్ని ప్రారంభించారని, కొత్త బస్సులకు నిధులు కేటాయించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ సుందరయ్య అన్నారు. ఫెడరేషన్ పశ్చిమగోదావరి జిల్లా రెండో మహాసభలు ఆదివారం తణుకు అమరవీరుల స్మారక భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం ప్రారంభమైన నెల రోజుల్లోనే కండక్టర్లు, డ్రైవర్లపై వేధింపులు, కేసులు, 60 మందికిపైగా సస్పెన్షన్లు నమోదయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పథకం ఉద్యోగులను వేధించే పథకంగా మా రకూడదని, కొత్త బస్సులు వేసి ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ బస్సుల సాకుతో..
విద్యుత్ బస్సుల సాకుతో ఆర్టీసీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే చర్యలు వెంటనే ఆపాలని, తొలి దశలో ప్రధాన నగరాల్లోని 2 డిపోలను, రెండో దశలో 19 డిపోలను ప్రైవేట్ విద్యుత్ బస్సు ఆపరేటర్లకు అప్పజెప్పేలా సన్నాహాలు జరుగుతున్నాయని సుందరయ్య విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు టీవీఎస్ మూర్తి జెండా ఆవిష్కరణ చేసి మహాసభకు అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి ఏఎస్ రాయుడు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి టీపీఆర్ దొర, డిపో కార్యదర్శులు ఎన్.శ్రీనివాస్, ఆర్.ఆంజనేయులు, నరసింహారావు, కట్ట సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా నాయకులు కామన మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.