
నిర్వాసితులను గాలికొదిలేశారు
ఏలూరు (టూటౌన్): పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఆ పార్టీ ఏలూరు జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టును 2027కి పూర్తి చేస్తామని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను సకాలంలో వినియోగించి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వలేని స్థితిలో ఉండి 2027కి పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్న ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులను గాలికి వదిలేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు ఎత్తు తగ్గిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి ప్రయోజనాలను నెరవేర్చలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రాధాన్యత క్రమంలో జరిపేందుకు, నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ