
ధాన్యం సేకరణకు సన్నద్ధం కావాలి
భీమవరం: జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు అధికారులు సన్నద్ధం కావాలని, మిల్లర్ల నుంచి నాణ్యమైన గోనె సంచులను సేకరించి రైతులకు అందించేందుకు చర్యలు చేపట్టాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ధాన్యం సేకరణ, రీ సర్వే, జీఎస్టీ, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, ఇళ్ల స్థలాలు తదితర అంశాల ప్రగతిపై మండలాల వారీగా డీఆర్వో, ఆర్డీఓ, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, వాణిజ్య, వ్యవసాయ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, వివాదాలకు తావులేకుండా పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. రీ సర్వేకు సంబంధించి గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, ఆర్డీఓ దాసి రాజు, వ్యవసాయశాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జీఎస్టీ అమ్మకాలపై ఆరా
భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక జువ్వలపాలెం రోడ్డులోని సోనోవిజన్ షోరూమ్‌ను జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ మేరకు అమ్మకాలు జరపాలని ఆదేశించారు. దుకాణదారులు జీఎస్టీ తగ్గించకుంటే వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చన్నారు. వాణిజ్య పన్నుల శాఖ డీసీ కేపీ శైలజ, జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ వి.కేదారేశ్వరరావు ఉన్నారు.