
సమ్మెలోకి పీహెచ్‌సీ వైద్యులు
నిలిచిన వైద్యసేవలు
సాక్షి, భీమవరం: డిమాండ్ల సాధన కోసం రూరల్ పీహెచ్‌సీ వైద్యులు సమ్మె సైరన్ మోగించారు. సోమ వారం నుంచి అత్యవసర సేవలు మినహా ఓపీ, స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ వైద్య శిబిరాలను బహిష్కరించారు. ఆనారోగ్య సమస్యలతో వైద్యం కోసం వచ్చిన రోగులకు నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ప్రాథమికంగా మాత్రలు అందించారు. జిల్లాలోని 34 రూరల్ పీహెచ్‌సీల పరిధిలో దాదాపు 74 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తగ్గించిన పీహెచ్‌సీ వైద్యుల పీజీ కోర్సుల కోటాను 20 శాతానికి పునరుద్ధరించాలని, టైం బాండ్ ప్రమోషన్స్ కల్పించాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేవారికి బేసిక్‌పై 50 శాతం అలవెన్స్ ఇవ్వాలని, చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ. 5,000 అలవెన్స్ ఇవ్వాలని, కౌన్సెలింగ్ విషయంలో అర్బన్ అండ్ నేటివిటీపై ఆరేళ్ల గడువును ఐదు సంవత్సరాలకు కుదించడం, నేటివిటీపై స్పష్టత కోరుతూ కొద్దిరోజులుగా పీహెచ్‌సీ వైద్యులు ఆందోళన చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్ అసోసియేషన్ (ఏపీపీహెచ్‌సీడీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 19న ఉన్నతాధికారులకు నోటీసు అందజేశారు. నిర్ణీత గడువులోగా ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెలోకి వెళ్లనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం నుంచి ఆందోళన బాట పట్టారు.
వైద్య శిబిరాల బహిష్కరణ
మహిళల్లో ఆనారోగ్య సమస్యలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 17 నుంచి అక్టోబరు 2 వరకు స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది. బీపీ, సుగర్, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లను గుర్తించేందుకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. సమ్మెలో భాగంగా చాలాచోట్ల వైద్యులు శిబిరాలను బహిష్కరించారు. నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది శిబిరాలు వైద్యసేవలు అందించి మమ అనిపించారు. వైద్యులు లేకుండా వైద్య శిబిరాలేంటని నరసాపురం రూరల్ మోడీ గ్రామంలో శిబిరానికి వచ్చిన మహిళలు బహిరంగంగానే మాట్లాడుకున్నారు.
సమస్యల పరిష్కారం కోసమే : ప్రజలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశ్యం కాదని, న్యాయమైన తమ డిమాండ్లు సాధించుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందని ఏపీపీహెచ్‌సీడీఏ నాయకులు అంటున్నారు. పీహెచ్‌సీ వైద్యుల పీజీ కోటా సీట్లను గత ఏడాది 30 శాతం నుంచి 20 శాతానికి తగ్గించిన కూటమి ప్రభుత్వం ఈ ఏడాది 15 శాతానికి తగ్గించినట్టు చెబుతున్నారు. సీహెచ్‌సీల్లో పనిచేసే సివిల్ అసిస్టెంట్ సర్జన్లు మూడు నాలుగేళ్లకే డిప్యూటీ సివిల్ సర్జన్స్‌గా పదోన్నతులు పొందుతుంటే తాము మాత్రం సీనియర్ మెడికల్ ఆఫీసర్లుగానే మిగిలిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే అక్టోబరు 3 నుంచి విజయవాడలో నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు చెబుతున్నారు.
జిల్లాలో జిల్లా ఆరోగ్యకేంద్రం, మూడు సీహెచ్‌సీలు, ఐదు ఏరియా ఆస్పత్రులు, 34 పీహెచ్‌సీలు, 18 అర్బన్ పీహెచ్‌సీలు ఉన్నాయి. రోజుకు దాదాపు 15 వేల వరకు ఓపీ నమోదవుతుంది. వీటిలో 40 శాతం వరకు రూరల్ పీహెచ్‌సీల్లోనే ఓపీ కేసులు ఉంటాయని అంచనా. రూరల్ పీహెచ్‌సీ వైద్యులు సోమవారం యథావిధిగా విధులకు హాజరైనప్పటికీ అత్యవసర సేవలు మినహా ఓపీ సేవలకు దూరంగా ఉన్నారు. అవుట్ పేషెంట్లుగా వైద్యం కోసం వచ్చిన గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొంతమంది నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోగా మరికొందరు అక్కడే ఉన్న ఏఎన్‌ఎంలతో సమస్య చెప్పుకుని వారిచ్చిన మందులు తీసుకెళ్లిన పరిస్థితి కనిపించింది. నరసాపురం నియోజకవర్గంలోని తూర్పుతాళ్లు, ఎల్‌బీ చర్ల, మొగల్తూరు, ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు పీహెచ్‌సీలు, భీమవరం రూరల్‌లోని గొల్లవానితిప్ప, తుందుర్రు, పాలకొల్లులోని యలమంచిలి, మేడపాడు, దొడ్డిపట్ల, అలాగే ఆచంట, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాలోని రూరల్ పీహెచ్‌సీ వైద్యులు ఓపీ విధులను బహిష్కరించారు. ఆస్పత్రులకు వచ్చిన రోగులకు స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్టులు ఓపీ సేవలు అందించారు. ప్రస్తుతం ప్రతికూల వాతావరణ పరిస్థితులతో విషజ్వరాలు ప్రబలుతుండగా వైద్యుల సమ్మెతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు.
రూరల్ పీహెచ్‌సీల్లో సేవలకు దూరంగా వైద్యులు
అత్యవసర సేవలు మినహా ఓపీ, వైద్య శిబిరాల బహిష్కరణ
రోగుల ఇక్కట్లు, వైద్యుల అవతారమెత్తిన వైద్య సిబ్బంది

సమ్మెలోకి పీహెచ్‌సీ వైద్యులు

సమ్మెలోకి పీహెచ్‌సీ వైద్యులు