
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ఆరోగ్యంతమైన మహిళ ద్వారా బలమైన కుటుంబం ఏర్పడుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో ‘స్వస్థ నారీ–సశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా మహిళా ఉద్యోగినిల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యమంతమైన మహిళ ద్వారా బలమైన కుటుంబాలు ఏర్పడతాయని, ఆర్థిక అభివృద్ధితో పాటు, పిల్లలు కూడా మంచి విద్యను నేర్చుకోవడానికి తోడ్పడుతుందన్నారు. మహిళలు ఆరోగ్యానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తారని, పిల్లలు, భర్తకు పెట్టిన తర్వాత తల్లి త్యాగానికి, ప్రేమకి చిహ్నంగా మిగిలితే తినడం సర్వసాధారణమన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే మహిళలు కూడా సరైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం లేదని, ఇలాంటి చర్యల కారణంగా ఒకేసారి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి.గీతాబాయి, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ అక్టోబర్ 1న చేపట్టనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సెప్టెంబర్ 30న పండుగ కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ల మొత్తాలను బ్యాంకుల నుంచి డ్రా చేశామన్నారు. జిల్లాలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్‌పై జీఎస్టీ ఛాంపియన్‌న్స్ ద్వారా ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా మొదటి వారం ప్రచారంలో ‘గృహ పొదుపు’ కార్యక్రమాన్ని సోమవారం భీమవరం 32వ వార్డు ఎడ్వర్డ్ ట్యాంక్ మీటింగ్ హాలులో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జీఎస్టీ తగ్గిన వస్తువుల ప్రదర్శనను తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.