
16 నెలల్లో రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు
పెనుగొండ: సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేయకుండానే కూటమి ప్రభుత్వం 16 నెలల కాలంలో రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని వైఎస్సార్‌సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. సోమవారం తూర్పుపాలెంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్‌ను నాయకులు, కార్యకర్తలతో కలసి ఆవిష్కరించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు చేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అని గాలికొదిలేశారన్నారు. ఆడబిడ్డ నిధికీ నేటి వరకూ అతీగతీ లేదన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికీ నేటి వరకూ ఒక్క సెంటు భూమి ఇవ్వలేదన్నారు. ఇల్లు మంజూరు చేయలేదన్నారు. గృహ నిర్మాణానికి ఒక్క రూపాయి ఇచ్చారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, మహిళలు, రైతులు, విద్యార్థులు, వ్యాపార వేత్తలకు కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ప్రతీ ఒక్కరికీ డిజిటల్ బుక్ శ్రీరామరక్షగా నిలుస్తుందన్నారు. ఐవీఆర్‌ఎస్ నెంబర్ 040 49171718కు డయల్ చేసి నమోదు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మేడపాటి సాయి చంద్రమౌళీశ్వర రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దంపనబోయిన బాబూరావు, మండల కన్వీనర్లు గూడూరి దేవేంద్రుడు, జక్కంశెట్టి చంటి, పిల్లి నాగన్న, సర్పంచ్‌లు సుంకర సీతారాం, బుర్రా రవికుమార్, చిట్టు గుళ్ల పూర్ణిమ, కర్రి వేణుబాబు, కోట వెంకటేశ్వరరావు, ముత్యాల నాగేశ్వరరావులు పాల్గొన్నారు.