
సాగని దారిలో ఆగిన గుండె!
పోలవరం నిర్వాసితుల కష్టాలు
వేలేరుపాడు: ఆ గ్రామాన్ని గోదావరి వరద చుట్టుముట్టింది.. ప్రభుత్వం కనీసం బోట్ కూడా ఏర్పాటు చేయలేదు. ప్రాణాలు దక్కించుకునేందుకు అష్టకష్టాలు పడినా.. ఆ కుటుంబానికి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చివరికి గుండెకోతే మిగిలింది. వేలేరుపాడు మండలంలోని తిర్లాపురానికి చెందిన కాకాని వెంకటేశ్వర్లు (41) ఆదివారం మధ్యాహ్నం గుండెనొప్పి రావడంతో ఇంట్లోనే సొమ్మసిల్లి పడిపోయాడు. వైద్యం నిమిత్తం వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలన్నా ఆ ఊరిని గోదావరి వరద చుట్టుముట్టింది. బంధువులు గోదావరి వరదలో ప్రాణాలకు తెగించి, థర్మాకోల్ షీట్‌పై పడుకోబెట్టి వరద దాటించి, కన్నాయిగుట్ట వరకు చేరుకున్నారు. కన్నాయిగుట్టకు వెళ్ళాక అంబులెన్స్ కోసం అరగంట సేపు వేచి చూశారు.
అంబులెన్స్ రాకపోవడంతో ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకొని ఐదు కిలోమీటర్ల దూరంలోని బుర్రతోగు వరకు వెళ్ళారు. అక్కడికి అంబులెన్స్ రావడంతో వేలేరుపాడు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వెంకటేశ్వర్లు ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మేళ్ళవాగు వంతెన గోదావరి వరద నీటిలో మునగడం వల్ల చాగరపల్లి, బుర్రతోగు, భూదేవిపేట మీదుగా ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంది. అధికారులు కనీసం ఒక బోట్ కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల వైద్యం అందక నిండు ప్రాణం పోయింది.

సాగని దారిలో ఆగిన గుండె!