
కూటమిపై భగ్గుమంటున్న ఉద్యోగులు
జీతాలు పెంచాలి
బోధనేతర భారం పెరిగింది
సమస్యలతో సతమతం
భీమవరం(ప్రకాశం చౌక్): కూటమి సర్కారు పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలతో సతమ తమవుతున్నారు. సమస్యల పరిష్కారం, ఎన్నికల హామీల అమలు, హక్కుల సాధన కోసం రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. పనిఒత్తిడి, వేధింపులు తదితర సమస్యలపై ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తిరుగు బావుటా ఎగురవేశారు. జిల్లాలో సచివాలయ ఉద్యోగులు మొదలు ఉపాధ్యాయులు, వైద్యులు, విద్యుత్, రెవెన్యూ ఉద్యోగులు, అంగన్‌వాడీ వర్కర్లు, సహకార ఉద్యోగులు, ఆశావర్కర్ల వరకూ నిరసన గళమెత్తారు. ప్రతి సోమవారం భీమవరంలో కలెక్టరేట్ వద్ద ఆందోళనలు, ధర్నాలు చేపట్టి కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. రాష్ట్రంలోని పలు శాఖల ఉద్యోగులు తారాస్థాయిలో పోరాటా లు చేస్తున్నా కూటమి ప్రభుత్వం వీరిని పట్టించుకోవడం లేదు. రోజులు తరబడి ఉద్యమాలు చేసినా, మంత్రులు హామీలు ఇచ్చినా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. కూటమి ప్రభుత్వ 16 నెలల పాలనలో జిల్లాలో శాఖల వారీగా నిరసన గళాలు, ధర్నాలు ఇలా..
గురువులకు బోధనేతర భారం
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధనేతర విధులతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం యో గాంధ్ర, పేరెంట్ మీటింగ్స్, యాప్‌లు, శిక్షణ, ఫొ టోల అప్‌లోడ్ వంటి పనులు అప్పగించడంతో విసుగు చెందుతున్నారు. బోధనేతర భారం తగ్గించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీలు అమలు చేయాలంటూ ధర్నాలు చేశారు.
సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ ఉద్యమం
పని ఒత్తిళ్లు, సర్వేల భారం, ఆత్మగౌరవాన్ని దిగజార్చడంపై సచివాలయ ఉద్యోగులు ఆత్మగౌరవ ఉద్యమం చేపట్టారు. దశల వారీగా నిరసనలు తెలుపుతున్నారు. జిల్లా కేంద్రం, మండలాల్లో అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చి రోజువారీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
సీహెచ్‌ఓల అలుపెరుగని పోరాటం
ఉద్యోగ భద్రత, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విలేజ్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్‌ఓలు) అలుపెరుగని పోరాటం చేశారు. 22 రోజుల పాటు దీక్షలు చేశారు.
గర్జించిన విద్యుత్ ఉద్యోగులు
విద్యుత్ సంస్థ గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ సంస్థ ఉద్యోగులు పోరాటానికి దిగారు. ఈనెల 19 నుంచి 21 వరకు నిరసనలు తెలిపి, 22న భారీ ర్యాలీగా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయాల ముట్టడికి సమాయత్తమయ్యారు.
‘రెవెన్యూ’కు క్లస్టర్ కష్టాలు
రెవెన్యూ శాఖలో వీఆర్వోలు, వీఆర్‌ఏలు క్లస్టర్ సమస్యతో సతమతమవుతున్నారు. ఒక్కొక్కరూ రెండు, మూడు గ్రామాలకు సేవలు అందించడంలో ఇబ్బంది పడుతున్నారు. సమస్యల పరిష్కారానికి వీఆర్వోలు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించగా.. వీఆర్‌ఏలు ధర్నాలు చేశారు.
అంగన్‘వాడీవేడిగా’..
జీతాల పెంపు హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడంతో అంగన్‌వాడీ టీచర్లు కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేశారు. జీతాల పెంపు, ఎక్స్‌గ్రేసీయా, యాప్‌ల భారం తగ్గింపు, పెన్షన్ తదితర డిమాండ్లతో ఆందోళనలు నిర్వహించారు.
పీహెచ్‌సీ వైద్యుల సమ్మెబాట
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సోమవారం నుంచి సమ్మె బాట పట్టనున్నారు. ఐదు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గళమెత్తుతున్నారు.
ప్రభుత్వం నుంచి అందని ‘సహకార’ం
జిల్లాలోని సహకార సంఘాల ఉద్యోగులు 16 డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నారు. జనవరిలో భీమవరంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అలాగే ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులు, ఆశావర్కర్లు, ఆరోగ్యమిత్రలు వారివారి సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నారు.
హక్కుల సాధనే లక్ష్యంగా..
సమస్యల పరిష్కారానికి పోరాటాలు
ఎన్నికల హామీలు అమలు చేయాలంటూ..
పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగుల నిరసన గళం
పోరాటాల వేదికగా కలెక్టరేట్
ఉద్యోగుల సమస్యలు పట్టని కూటమి సర్కారు
ఎన్నికల హామీ మేరకు అంగన్‌వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచాలి. ఇప్పటికే సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాం. అయి నా కూటమి ప్రభుత్వం ఎ లాంటి నిర్ణయం తీసుకోలేదు. పనికి తగిన వేతనం, ఎక్స్‌గ్రేసియా, పెన్షన్ అడుగుతున్నాం.
–సీహెచ్ మహలక్ష్మి, ప్రాజెక్టు లీడర్, భీమవరం
విద్యార్థులకు పాఠాలు చెప్పే సమయం ఉపాధ్యాయులకు తగ్గిపోయింది. బోధనేతర పనులు భారంగా మారాయి. యాప్‌ల భారం, పని ఒత్తిడి తో టీచర్ల ప్రాణాలు పోతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు ప్రభుత్వం పీఆర్‌సీ కమిషన్ వేసి ఐఆర్ ప్రకటించాలి.
–పి.విజయరామరాజు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
కూటమి ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను రద్దు చేసి సచివాలయ ఉద్యోగులపై క్లస్టర్ భారం వేసింది. దీంతో పనిభారం బాగా పెరిగింది. మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదు. దీంతో సచివాలయ ఉద్యోగులు ఆత్మ గౌరవ ఉద్యమం చేపట్టారు.
– ఎ.శ్రీనివాస్ ఏపీఎంఎంఈఏ రాష్ట్ర ప్రచార కార్యదర్శి

కూటమిపై భగ్గుమంటున్న ఉద్యోగులు

కూటమిపై భగ్గుమంటున్న ఉద్యోగులు

కూటమిపై భగ్గుమంటున్న ఉద్యోగులు