
ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రోత్సాహం అభినందనీయం
పెనుగొండ: విద్యను ప్రోత్సహించడానికి అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని కర్నాటక తంకూరు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో ప్రతిభ కనబరిచిన ఆర్యవైశ్య విద్యార్థులను ఆదివారం స్థానిక వాసవీ శాంతి థాంలో ఘనంగా సత్కరించారు. 2024–25లో టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారితో పాటు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని ఆర్యవైశ్య క్రీడాకారులను కలిపి మొత్తంగా 400లకు పైగా విద్యార్థులతో పెనుగొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి బాల స్వామీజీ, ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆర్యవైశ్య విద్యార్థులంతా వాసవీ మాత స్ఫూర్తిగా పట్టుదలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వెంకటేశ్వర్లు అన్నారు. ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి బాల స్వామిజీ, ఏపీ ఆర్యవైశ్య డెవలప్ మెంట కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ, ట్రస్ట్ ఉపాధ్యక్షుడు బొండాడ రాంపండు, కార్యదర్శి కేఆర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.