
బాలకృష్ణది పశు ప్రవృత్తి
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెం: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణది పశు ప్రవృత్తి అని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. తాడేపల్లిగూడెంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాదరణ పొంది, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి బాలకృష్ణ అసెంబ్లీలో సంస్కారహీనంగా, సభ్యత లేకుండా మాట్లాడటం సరికాదని కొట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం చూశాక ఆయన తండ్రి సంస్కారం బాలకృష్ణలో ఏ కోణంలో కూడా లేదనిపించిందని ఘాటుగా విమర్శించారు. సినీ నటుడు చిరంజీవి అందరూ గౌరవించే సినీ పెద్ద అని, ఆయన ఉన్నతిని బాలకృష్ణ స్వీకరించలేడని విమర్శించారు. బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేస్తుండగా సభాస్థానంలో ఉన్న వ్యక్తి నవ్వడం చూస్తుంటే సభాస్థానాన్ని కించపర్చడమేనని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగదన్నారు. బాలకృష్ణ ప్రవర్తన, మాట తీరు చూస్తుంటే అసెంబ్లీకి వచ్చే సభ్యులకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేసి లోపలికి అనుమతించాల్సించిన పరిస్థితి ఉందేమో అని సందేహం వ్యక్తం చేశారు. అలాగే ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వయసుకు తగ్గట్టుగా మాట్లాడాలని కొట్టు హితవు పలికారు.
బాలకృష్ణ ఒక సైకో
బాలకృష్ణ ఒక సైకో అని కొట్టు విమర్శించారు. ఆయన ఇంట్లో ఒక సినీ నిర్మాతను తుపాకీతో కాల్చి చంపారని, దానికి గత కారణం అందరికీ తెలుసని కొట్టు అన్నారు. ఆనాడు బాలకృష్ణ ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న సంగతి తెలిసిందేనని గుర్తుచేశారు. గతంలో ఇలానే మహిళలను కించపరిచేలా బాలకృష్ణ మాట్లాడారన్నారు. చిరంజీవి పట్ల జగన్ ఎంత అభిమానంగా, ఆప్యాయంగా ఉన్నారో.. సినీ పరిశ్రమ సమస్యలను చిరంజీవి బృందంతో పరిష్కరించే విషయంలో జగన్ ఎంత హుందాగా ప్రవర్తించారో అందరికీ తెలిసిందేనని చెప్పారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంత హుందాగా ప్రవర్తించారో, అదే ఒరవడితో జగన్ పాలనను అందించారని కొట్టు అన్నారు.