
బీసీలకు అన్యాయం చేస్తే పోరాటమే
భీమవరం: రాష్ట్రంలో బీసీ కులాలను అణగదొక్కాలని చూస్తున్నారని, బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటాలు చేస్తామని నేషనల్ బీసీ సమాఖ్య సంక్షేమ సంఘం నేషనల్ ప్రెసిడెంట్ గుత్తుల తులసీగురి, ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ గంగారామ్ అన్నారు. గురువారం భీమవరంలో నేషనల్ బీసీ సమాఖ్య సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా బీసీ కులాలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించి, బీసీలకు రక్షణ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడిగా గుత్తుల తులసీగురి, ఉపాధ్యక్షుడిగా మోపాటీ బలపరమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దొంగ కృష్ణ, జాయింట్ సెక్రటరీ ఎం.విజయ్ ఎన్నికకాగా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్ గంగారామ్, కండిబోయిన సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షునిగా కొమ్మోజు కన్నబాబు, జాయింట్ సెక్రటరీ గుబ్బల నాగేశ్వరరావు, ప్రచార కమిటీ చైర్మన్‌గా వాస రామ ఎన్నికయ్యారు.
పెరుగుతున్న గోదావరి వరద
పోలవరం రూరల్: గోదావరి వరద ఉధృతంగా పెరుగుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ వాగుల నీరు నదిలోకి చేరడంతో క్రమేపీ పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 30.740 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు 6.16 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. దిగువన వరద ప్రవాహం పెరిగింది. ఎగువన భద్రాచలం వద్ద 37.10 అడుగులకు నీటిమట్టం చేరుకుంది.
నేవీ డిపోకు వ్యతిరేకంగా ఉద్యమం
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): నేవీ ఆయుధ డిపో పేరుతో చేస్తున్న భూసేకరణను వెంటనే నిలిపివేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం ఏలూరు పవరుపేటలో పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేవీ ఆయుధ డిపోకు సంబంధించి భూసేకరణకు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, కలెక్టర్ వెట్రిసెల్వి, నేవీ అధికారులు చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తున్నామన్నారు. గిరిజనులు ఆయుధ డిపోను వ్యతిరేకిస్తున్నా భూసేకరణకు ముందుకు సాగడం దారుణమన్నారు. సీపీఎం కేసులకు భయపడదని, ప్రజా సమస్యలపై పోరాడుతుందన్నారు. విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బీ. బలరాం, జిల్లా కార్యదర్శి ఏ. రవి, కార్యదర్శి సభ్యులు తెల్లం రామకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్, ఆర్. లింగరాజు, ఎం.నాగమణి, జీ.రాజు, కే.శ్రీనివాస్, పీ.రామకృష్ణ పాల్గొన్నారు.
27న జాబ్‌మేళా రెండో విడత ప్రవేశాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నేషనల్ కెరీర్ సర్వీస్, సెట్‌వెల్ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్ కాంపౌండ్‌లోని సెట్‌వెల్ కార్యాలయంలో జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వీ.వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్‌మేళాలో హ్యాపీ మొబైల్స్, వేరియంట్ ప్రైమరీ స్కూల్, ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ కంపెనీల్లో వివిధ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.
డిగ్రీ కళాశాలల్లో రెండో విడత ప్రవేశాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): డిగ్రీ కళాశాలల్లో రెండో విడత ప్రవేశాలకు ఈనెల 29వ తేదీ వరకు గడువు ఉందని ఏలూరు జిల్లా నోడల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యుడు గుత్తా గిరిబాబు ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష పాసైన విద్యార్థులు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.