
ఏజెన్సీలో భూసేకరణ నిలుపుదల చేయాలి
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో భూసేకరణ నిలుపుదల చేయాలని, నేవీ ఆయుధ కర్మాగార నిర్మాణం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్ చేసింది. గురువారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంజా కృష్ణంరాజు అధ్యక్షతన ఆదివాసీ ముఖ్య నాయకుల సమావేశం బుట్టాయగూడెంలో జరిగింది. ఏపీ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ మొడియం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటికే సేకరించి వివాదాల్లో ఉన్న వేల ఎకరాల భూమిని పోలవరం నిర్వాసితులకు కేటాయించడం వల్ల భూవివాదాలతో స్థానిక ఆదివాసీ నిర్వాసితులు, ఆదివాసీలు నిరంతరం గొడవలు పడుతూ అశాంతితో జీవిస్తున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏడు మండలాల పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను తీసుకువచ్చి వారికి బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో పునరావాసం కల్పించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. పెద్ద మొత్తంలో ప్రభుత్వం సొమ్మును దోచుకోవడానికి ఎల్‌టీఆర్ భూములను సేకరించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, దళారులు పడుతున్న తాపత్రయం, హడావిడి చూస్తుంటే భారీ కుంభకోణం జరుగుతుందని అర్థమవుతుందని చెప్పారు. ఏటీఏ నాయకులు తెల్లం రాములు, తెల్లం గంగరాజు, కోర్సా నాగేశ్వరరావు, కుంజా రమేష్ పాల్గొన్నారు.