
పాలకొల్లు సెంట్రల్ : మండలంలోని పూలపల్లి గ్రామానికి చెందిన తోట ఝాన్సీ (33) తన భర్త వేధింపులు భరించలేక బుధవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తండ్రి ముదరకొల ప్రభుదాసు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల ప్రకారం భీమవరం మండలం వెంప గ్రామ శివారు కొత్తపేటకు చెందిన ఝాన్సీకి 13 ఏళ్ల క్రితం దుర్గా పెద్దిరాజుతో వివాహమైంది. వివాహం తరువాత వీరిద్దరు పూలపల్లి నివాసం ఉంటున్నారు. రెండు సంవత్సరాలు ఇద్దరు బాగానే ఉన్నా పెద్దిరాజు మద్యానికి బానిసై భార్యను అనుమానిస్తూ తిడుతూ, కొడుతూ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేసేవాడు.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పెద్దిరాజు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడడంతో ఝాన్సీ తన తమ్ముడికి పిల్లలని బాగా చూసుకోమని, తన భర్త వేధింపులు భరించలేనని మెసేజ్ పెట్టింది. మెసేజ్ చూసుకుని పూలపల్లి వచ్చేసరికి ఝాన్సీ బెడ్ రూమ్‌లో ఫ్యాన్‌కి చీర కట్టి ఉరేసుకుంది. మృతురాలి తండ్రి ప్రభుదాసు పిఫిదు మేరకు తోట దుర్గా పెద్దిరాజు, అతని తల్లిదండ్రులు వీరభద్రరావు, సత్యవతిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.