
పారదర్శకంగా ఆక్వాజోనైజేషన్
భీమవరం: ఆక్వాజోనైజేషన్ నిర్ధారణలో నిబంధనల మేరకు పారదర్శకతతో కూడిన ప్రతిపాదనలను సిఫార్సు చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో మత్స్య, వ్యవసాయ శాఖ అధికారులు, ఉండి, ఆకివీడు, కాళ్ళ, భీమవరం, పెంటపాడు, గణపవరం మండలాల ఎఫ్‌డీఓలు, ఎంఏఓలతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 19న నిర్వహించిన ఆక్వా జోనైజేషన్ ప్రకటన కమిటీలో ఆమోదించిన 31,307.4 ఎకరాల విస్తీర్ణంతో కలిపి ప్రస్తుతం జిల్లాలో 1,32,562.9 ఎకరాల ఆక్వా సాగు విస్తీర్ణం ఉందని తెలిపారు. ఆక్వా జోనైజేషన్ సర్వేలో వివిధ కారణాలతో తిరస్కరించిన 9,855.31 ఎకరాల విస్తీర్ణంపై జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన సోమవారం పునఃపరిశీలన జరిగింది. సమావేశంలో మత్స్య శాఖ సహాయ సంచాలకుడు ఆర్.వి.ఎస్.ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.