
డాక్టర్ బాబ్జీకి జగన్ పరామర్శ
పాలకొల్లు సెంట్రల్: ప్రముఖ వైద్యుడు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ సత్యనారాయణమూర్తి(బాబ్జీ) కుమారుడు అంజిబాబు మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. సోమవారం డాక్టర్ బాబ్జీకి ఫోన్ చేసిన జగన్‌మోహన్‌రెడ్డి అంజిబాబు మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్‌ఏ) జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి డిమాండ్ చేశారు. పట్టణంలో సోమవారం డీవైఈఓ రామాంజనేయులకు ఏఐఎస్‌ఏ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. అప్పలస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు దసరా సెలువులు ప్రభుత్వం ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2 వరకు ఇచ్చిందని, అయితే సెలవులు ఇవ్వని వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని, పట్టణంలోని ప్రైవేటు విద్యా సంస్థలు యథావిధిగా స్కూల్స్ నడిపారన్నారు. విద్యార్థి సంఘాలు స్కూల్స్ నడిపే వారి వద్దకు వెళ్తే మాకు పర్మిషన్ ఉందని సమాధానాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్: తాడేపల్లిగూడెం పట్టణ, పరిసర గ్రామాల్లో గడిచిన 24 గంటల్లో 30.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని తహసీల్దార్ ఎం.సునీల్ కుమార్ సోమవారం తెలిపారు. పెంటపాడు మండలంలో 18.0 మిల్లీమీటర్లుగా వర్షపాతం నమోదైందన్నారు. సోమవారం సాయంత్రం 5.40 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భారీ వర్షం కురిసింది. దాదాపు గంటన్నరకు పైగా కురిసిన వర్షంతో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, తాలూకా ఆఫీస్ సెంటర్, పంచాయతీ రాజ్ కార్యాలయం తదితర లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది.
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డీఎస్పీ–2025లో నూతనంగా ఎంపికై న ఉపాధ్యాయులందరూ ఈ నెల 25న అమరావతిలో నియామకపు లేఖ అందిస్తారని జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఈ నెల 24న సాయంత్రం 4 గంటలకు ఏలూరులో నిర్వహించే వెన్యూకి వచ్చి రిపోర్ట్ చేయాలని, అక్కడి నుంచి 25న ఉదయం 8 గంటలకు బస్సు ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు నేరుగా అమరావతిలో జరిగే కార్యక్రమ ప్రాంగణానికి చేరుకుంటారన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అమరావతిలో నియామక లేఖ అందచేస్తారన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ఇన్‌చార్జ్ జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిగా ఏవీ సూరిబాబు నియమితులయ్యారు. సోమవారం కలెక్టరేట్ చాంబర్‌లో కలెక్టర్‌ని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
టి.నరసాపురం: మండలంలో కురిసిన భారీ వర్షానికి ముగ్గురాళ్ళ వాగు, జలవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇటీవల భారీ వర్షాలతో వాగులు ఉధృతంగా ప్రవహించడంతో మండలంలోని బండివారిగూడెం–మక్కినవారిగూడెం, టి.నరసాపురం – మక్కినవారిగూడెం గ్రామాల మధ్య రెండు రోజుల పాటు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి మరోసారి భారీ వర్షం కురవడంతో ముగ్గురాళ్ళవాగు, జలవాగులు వంతెనపై నుంచి పొంగి ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు, పోలీసు సిబ్బంది వాగును పరిశీలించి రోడ్ల వద్ద హెచ్చరికలు ఏర్పాటు చేశారు.

డాక్టర్ బాబ్జీకి జగన్ పరామర్శ