
రోడ్లపై తిరగలేం
ఎంతో బాధేస్తోంది
పట్టించుకోవడం లేదు
అన్నీ గుంతలే
సాక్షి, భీమవరం : అసెంబ్లీ సాక్షిగా జిల్లాలోని రోడ్లు దుస్థితికి ఎమ్మెల్యేల వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల్లో ఒకటైన రోడ్లను అభివృద్ధి చేయక ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం రోడ్డెక్కుతున్నారు. ఎమ్మెల్యేలకు ఈ సెగ తాకుతోంది. రోడ్లపై ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారంటూ అసెంబ్లీలో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యేలు పులపర్తి, బొలిశెట్టిలు ఈ విషయమై నిలదీశారు.
మున్నాళ్ల ముచ్చట
రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడంలో చేతులెత్తేసిన కూటమి సర్కారు మరమ్మతులు తూతూమంత్రంగా చేసింది. ప్యాచ్ వర్కులు, అత్యవసర మరమ్మతుల నిమిత్తం జిల్లాకు రూ.42.57 కోట్లు మంజూరు చేసింది. స్టేట్ హైవే(ఎస్‌హెచ్) రోడ్లలో రూ. 10.45 కోట్లు విలువైన 41 పనులు, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ల(ఎండీఆర్)లో రూ.32.12 కోట్లు విలువైన 140 పనులు ఉన్నాయి. వీటిలో దాదాపు 70 శాతం మేర పనులు మాత్రమే పూర్తయినట్టు అంచనా. నిర్ణీత ప్రమాణాలు పాటించకుండా చాలాచోట్ల నాసిరకంగా పనులు చేశారు. వాహనాల తాకిడికి రాళ్లు పైకిలేచి రోడ్డంతా చెల్లాచెదురై అధ్వానంగా తయారయ్యాయి.
ప్రయాణికుల అగచాట్లు
జిల్లాలోని తాడేపల్లిగూడెం–ప్రత్తిపాడు, భీమవరం–తాడేపల్లిగూడెం, మోగళ్లు– అత్తిలి, బ్రాహ్మణచెరువు–వీరవాసరం, సిద్దాంతం–పెనుగొండ, పెదకాపవరం–క్రొవ్విడి, నౌడూరు– కొండేపూడి తదితర రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ పెద్దపెద్ద గోతులతో ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్నిచోట్ల మడుగులను తలపిస్తున్నాయి. వర్షం నీరు చేరి గోతులు కనిపించక ప్రయాణికులు ప్రమాదాలు పాలవుతున్నారు. వాహనాల తాకిడికి రోడ్లుపై ఉన్న బురద దారిన వెళ్లే వారిపై పడి తీవ్ర అసౌకర్యానికి గురికావాల్సి వస్తోంది. ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం రోజూ రాకపోకలు సాగించేవారు, ద్విచక్ర వాహనచోదకులు నడుంనొప్పి, వెన్నునొప్పితో బాదపడుతున్నామని, వాహననాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని వాపోతున్నారు.
నవుడూరులో రోడ్డెక్కిన జనం
నరకానికి నకలు ఈ రోడ్డంటూ ఇటీవల బ్రాహ్మణచెరువు– వీరవాసరం రోడ్డులోని నవుడూరు వద్ద గ్రామస్తులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. మడుగులను తలపిస్తున్న గోతులతో రాకపోకలు సాగించలేకున్నామని వాహనాలను రోడ్డుపై నిలిపి నిరసన తెలిపారు. ప్రయాణికులు వాహనాలు నిలిపి వారికి మద్దతు తెలిపారు. గత ప్రభుత్వంలో మంజూరైన రూ.2.5 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
అసెంబ్లీ సాక్షిగా రోడ్ల దుస్థితిని చాటి చెప్పిన కూటమి ఎమ్మెల్యేలు
జిల్లాలో అధ్వానంగా రోడ్లు
మూన్నాళ్ల ముచ్చటైన మరమ్మతులు
రాకపోకలు సాగించలేక ప్రయాణికుల అవస్థలు
నవుడూరులో గోతుల్లో వాహనాలు నిలిపి నిరసన తెలిపిన ప్రజలు
అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైనా రోడ్ల సమస్య అలానే ఉంది. ఆర్‌అండ్‌బీ మంత్రి గారికి చాలాసార్లు చెప్పాం. రోడ్లు బాగుచేయడం లేదని.. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదు. రోడ్లపై తిరిగే పరిస్థితి లేకుండా ఉంది. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలి.
– తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
యనమదుర్రు డ్రెయిన్‌పై అసంపూర్తిగా నిలిచిపోయిన మూడు అప్రోచ్ రోడ్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి ఎన్నోమార్లు తీసుకువచ్చాను. మంత్రికి పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చాను. అవి పూర్తయితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. భీమవరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
– భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు
బ్రాహ్మణచెరువు–వీరవాసరం రోడ్డులో నౌడూరు వద్ద 300 మీటర్లు మేర రోడ్డు ధ్వంసమైంది. మా మెకానిక్ షాపు ఇక్కడే ఉండటం వల్ల కళ్లెదుటే ఎంతోమంది ప్రయానికులు గోతుల్లో అదుపుతప్పి పడిపోవడం చూస్తుంటే ఎంతో బాధేస్తోంది.
– మేనేడి సత్యనారాయణ, మాజీ ఉపసర్పంచ్, పొలమూరు
రోడ్లు అధ్వానంగా తయారవ్వడంతో నిత్యం ప్రయాణికులు ప్రమాదాల పాలవుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదు. ప్యాచ్ వర్కులు పూర్తిగా చేయలేదు. రోడ్ల నిర్మాణం కూడా చేపట్టలేదు.
– పోతంశెట్టి లక్ష్మి, పెంటపాడు
నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎక్కడ చూసినా గోతులే. మరమ్మతులు తూతూమంత్రంగా చేయడంతో కొద్దిపాటి వర్షానికే అవి పాడైపోయాయి. ఈ రోడ్లపై రాకపోకలకు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.
– అంబటి రమేష్, ఆకివీడు

రోడ్లపై తిరగలేం

రోడ్లపై తిరగలేం

రోడ్లపై తిరగలేం

రోడ్లపై తిరగలేం

రోడ్లపై తిరగలేం