
వీసీ ఎంపికపై వీడని చిక్కుముడి
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ నియామకంపై ఇంకా చిక్కుముడి వీడలేదు. వీసీ ఆగస్టు 31న ఉద్యోగ విరమణ చేశారు. ఇంతవరకు ఎవరినీ ఇన్‌చార్జిగా కూడా నియమించలేదు. యుజీసీ నిబంధనల మేరకు ప్రకారం వయస్సు పొడిగింపు వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో ఉద్యాన వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా నియమించడానికి అర్హులైన మూడు పేర్లను పంపించాలని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సుబ్రహ్మణ్యం, ప్రసన్నకుమార్, గోవిందరాజులు పేర్లు ప్రభుత్వానికి వెళ్లాయి. అక్కడి నుంచి వ్యవసాయ శాఖ మంత్రి పేషీకి పంపించారు. ఈ ఫైల్‌ను సుమారు పది రోజులకు పైగా మంత్రి పేషీలో ఉంచారు. ఈ ఫైల్‌ను కదపకుండా మంత్రి దృష్టికి తీసుకెళ్లకుండా కొందరు అధికారులు గోప్యత పాటించారని తెలుస్తోంది. ఉద్యాన వర్సిటీ స్థాపించిన 18 ఏళ్లలో వీసీ కుర్చీ ఇన్నాళ్ల పాటు ఖాళీగా లేదు. ఇన్‌చార్జి లేదా పూర్తిస్థాయి బాధ్యతలతో వీసీగా పనిచేసి ఇంకో నెల రోజుల్లో ఉద్యోగ విరమణ చేస్తారనగా క్రియాశీలక నిర్ణయాలు, కీలక అంశాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేయడం కుదరదని, వర్సిటీ మార్గదర్శకాలు ఉన్నాయి. అత్యవసర విషయాలైతేనే చివరి నెలలో కూడా వీసీ సంతకాలు చేయొచ్చు. ఉద్యాన వర్సిటీలో ఆగస్టు నెలలో కొన్ని కీలక విషయాలపై సంతకాలు జరిగాయనే ప్రచారం ఉంది. వర్సిటీలో పనిచేసే కొందరు ప్రొఫెసర్లకు సీనియర్ ప్రొఫెసర్‌గా పదోన్నతిపై సంతకాలు చేశారని సమాచారం. బోధనా విధుల కోసం నెలకు రూ.35 వేలు, రూ.45 వేలు, రూ.55 వేలు వేతనం చెల్లించేలా టీచింగ్ అసోసియేట్స్‌ను వీసీ విచక్షణాధికారంతో నియమించుకోవచ్చు. ఇలాంటి నియామకాల ఫైల్‌పై గత నెలలో సంతకాలు జరిగాయనే చర్చ నడుస్తోంది. కేవలం వెబ్‌సైట్‌లో ప్రకటన ఇచ్చి ఈ పోస్టులను భర్తీ చేసుకోవచ్చు, కాని ఉద్యోగ విరమణ సమయంలో చేయకూడదనే నిబంధన ఉందంటున్నారు. వీసీ లేకపోవడంతో ఆఫ్‌కాస్ కింద పనిచేసే సెక్యూరిటీ, కాంట్రాక్టు సిబ్బందికి కొద్ది నెలలుగా జీతాలు లేకున్నా బాధ్యులు పట్టించుకోలేదని సమాచారం.
ఉద్యానవర్సిటీ పాలనా భవనం