
ఆయాలకు అందని జీతాలు
భీమవరం: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా గత ప్రభుత్వం మనబడి నాడు–నేడు పథకంలో అభివృద్ధి చేయడమేగాక విద్యార్థులకు పూర్తిస్థాయిలో మరుగుదొడ్ల సౌకర్యం కల్పించింది. వాటి నిర్వహణకు ప్రత్యేకంగా ఆయా లను నియమించి ప్రతి రోజు నాలుగు సార్లు మరుగుదొడ్లు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవడమేగాక వాటికి అవసరమైన మెటీరియల్ ప్రభుత్వం పంపిణీ చేసింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో పాఠశాల విద్యార్థినులకు మరుగుదొడ్లు ఇబ్బంది తీరింది. వాటిని శుభ్రంచేసే పనితో అనేకమందికి ఉపాధి లభించింది. ఆయాలకు అప్పటి ప్రభుత్వం నెలకు రూ.6 వేల జీతమే నేటి కూటమి ప్రభుత్వం ఇవ్వడంతో పెరిగిన ధరలతో కుటుంబం గడవడం ఇబ్బందిగా ఉందని ఆయాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సుమారు 1,440 మంది ఆయాలు
గత ప్రభుత్వం స్కూల్స్‌లో సకల సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేసింది. జిల్లాలోని సుమారు 1,360 జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో 1,440 మంది ఆయాలు, దాదాపు 100 మంది నైట్‌వాచ్‌మెన్‌లను నియమించింది. నెలకు రూ.6 వేల జీతం నిర్ణయించింది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 300 కంటే తక్కువగా ఉంటే ఒకరు, 600 వరకు ఇద్దరు, 600కు పైగా విద్యార్థులున్న పాఠశాలకు ముగ్గురు ఆయాలను నియమించారు. ఆయాలు ప్రతి రోజు నాలుగు సార్లు మరుగుదొడ్లు శుభ్రం చేయడంతోపాటు, పాఠశాల గదులు, ఆవరణ శుభ్రం చేయాల్సివుంటుంది.
సక్రమంగా అందని జీతాలు : తక్కువ మొత్తంలో జీతాలు ఇస్తున్న ప్రభుత్వం మూడు, నాలుగు నెలలకు ఒకసారి జీతాలు ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్(టీఎంఎఫ్) అప్పుడప్పుడు విడుదల చేయడం వల్ల సక్రమంగా జీతాలు అందడం లేదు. మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు కెమికల్స్ వినియోగించడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పత్నమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము చేసే పనిని దృష్టిలో పెట్టుకుని నెలకు రూ. 15 జీతం, ఈఎస్‌ఐ, పీఎఫ్, మెడికల్ అలవెల్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
జిల్లాలో 1,440 మంది ఆయాల నియామకం
ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్నా నెలకు రూ. 6 వేలే జీతం
ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేస్తేనే జీతాలు