
గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి
భీమవరం(ప్రకాశం చౌక్): గర్భిణులు, బాలింతలకు అంగనవాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రగతిపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు అందుతున్న పౌష్టికాహారం తింటున్నారా? లేదా? పరిశీలించి గర్భిణీ సీ్త్రలకు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే తల్లీబిడ్డల ఆరోగ్యంపై అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా బాల్యవివాహాలు నమోదు కాకూడదన్నారు. సమావేశంలో మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ అధికారి డి.శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, అవసరం మేరకు వెంటనే నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ మీటింగ్ నిర్వహించారు. స్వచ్ఛభారత్ మిషన్ పనులు, స్వచ్ఛతాహి సేవ –2025 కార్యక్రమాలు, జల జీవన్ మిషన్ పనులు, విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీ సభ్యుల చొరవ, తదితర అంశాలపై సమీక్షించారు.
పెనుగొండ: ములపర్రు సర్పంచ్ చెక్ పవరు రద్దు కేస్తూ డీపీఓ రామ్‌నాథ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పంచాయతీపై అవినీతి ఆరోపణ నేపథ్యంలో విచారణ నిర్వహించారు. అవినీతి జరిగినట్లు గుర్తించడంతో గ్రామ కార్యదర్శులుగా విధులు నిర్వహించిన నలుగురుకు నోటీసులు జారీచేస్తూ, సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
చింతలపూడి: పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు తోడు ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్‌కు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయం నుంచి 1,072 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. భారీ వర్షాలకు ఎగువ ఖమ్మం జిల్లా నుంచి తమ్మిలేరుకు వరద నీరు చేరుతోంది. తమ్మిలేరు ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 348.60 అడుగులకు చేరుకుందని, గోనెలవాగు నీటిమట్టం 348.27 అడుగులకు చేరుకున్నట్లు తమ్మిలేరు ఇరిగేషన్ ఏఈ లాజర్‌బాబు తెలిపారు. ప్రాజెక్టు సామర్ధ్యం 3 టీఎంసీలు కాగా 1.883 టీఎంసీలకు చేరుకున్నట్లు చెప్పారు.