
ఆపరేషన్ థియేటర్లలో చేతివాటం..!
చర్యలు తప్పవు..
● థియేటర్ నుంచి రోగిని వార్డుకు తరలించేందుకు డబ్బులు డిమాండ్ ● ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో సిబ్బంది దందా! ● రూ.500 నుంచి 800 వరకు వసూలు
●ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో శస్త్రచికిత్స నిర్వహించిన ఓ రోగిని వార్డుకు తరలించడానికి అక్కడ సిబ్బంది రోగి బంధువులను రూ.500 డిమాండ్ చేశారు. రూ.400 మాత్రమే ఉన్నాయని వారు ఆ మొత్తాన్ని ఇచ్చారు.
●విజయనగరంలోని ఓ పైవేటు ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) ఆసుపత్రిలో గంగమ్మ అనే మహిళ గుండె సంబంధిత వ్యాధితో
ఆసుపత్రిలో చేరింది. ఆమెకు యాంజియోగ్రామ్ చేసిన తర్వాత సిబ్బంది వార్డుకు
తరలించడానికి రూ.500 తీసుకున్నారు.
విజయనగరం ఫోర్ట్:
ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) ద్వారా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల వద్ద ఆయా ఆసుపత్రుల సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వివిధ రకాల వ్యాధులతో ఆసుపత్రుల్లో చేరిన రోగులకు వైద్య పరీక్షలకు, ఎక్సరే, స్కానింగ్, ఈసీజీ తీసిన మీదట శస్త్ర చికిత్సలు ఆపరేషన్ థియేటర్‌లో నిర్వహిస్తారు. శస్త్రచికిత్స అనంతరం రోగులను వార్డుకు తరలించడానికి అక్కడ వైద్య సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో 25 ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులు
జిల్లాలో ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రులు 25 ఉన్నాయి. అభినవ ఆసుపత్రి, అమృత, ఆంధ్ర, గాయిత్రి, జీఎంఆర్ వరలక్ష్మి, కావేరి, కొలపర్తి, మువ్వ గోపాల, నెప్రో ప్లస్, పీజీ స్టార్, పుష్పగిరి విక్టోరియా రెటినో ఇనిస్టిట్యూట్, క్వీన్స్ ఎన్‌ఆర్‌ఐ, సంజీవిని సూపర్ స్పెషాలటీ, బాబూజీ, శ్రీసాయి సూపర్, శ్రీ సాయికృష్ణ, సాయి పీవీఆర్, శ్రీనివాస నర్సింగ్ హోమ్, సన్‌రైజ్, స్వామి కంటి ఆసుపత్రితో పాటు తిరుమల మెడికవర్, వెంకటరామ, వెంకట పద్మ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం ఉంది. ప్రభుత్వ నెట్ వర్క్ ఆసుపత్రులు 55 ఉన్నాయి.
నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో 1220 బెడ్ల కేటాయింపు
ప్రభుత్వ, ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి 1220 బెడ్లు కేటాయించారు. ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో 751, సీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రుల్లో 321, పీహెచ్‌సీల్లో 148 బెడ్లు కేటాయించారు. ఇందులో సగటున 1000 నుంచి 1200 మంది వరకు చికిత్స పొందుతుంటారు. ఈ ఆసుపత్రుల్లో సగటున రోజుకు జిల్లాలో 150 నుంచి 200 వరకు శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి.
రూ.500 నుంచి రూ.800 వరకు డిమాండ్
ఆపరేషన్ థియేటర్లలో రోగికి శస్త్రచికిత్స జరిగిన తర్వాత వార్డుకు తరలించడానికి అక్కడ సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల రూ.500 వరకు డిమాండ్ చేస్తుండగా, మరికొన్ని చోట్ల రూ.800 వరకు డిమాండ్ చేస్తున్నట్టు రోగులు ఆరోపిస్తున్నారు. అడిగినంత ఇస్తే పరవాలేదు. లేదంటే వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) పథకం ద్వారా చికిత్సగాని, శస్త్రచికిత్సగాని చేయించుకున్న రోగులకు పూర్తి సేవలు ఉచితంగా అందించాల్సి ఉంది. ఒక్క పైసా కూడాఖర్చు కాకూడదు. రోగుల నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉచితంగా అందించాల్సిన సేవలు కోసం చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) ద్వారా చికిత్స, శస్త్రచికిత్స చేసుకున్న రోగులకు ఉచితంగా సేవలు అందించాలి. ఒక్క పైసా రోగు లు నుంచి తీసుకోకూడదు. డబ్బులు వసూ లు చేసినట్టు ఫిర్యాదులు వస్తే సంబంధిత ఆసుపత్రిపైన, సిబ్బందిపైన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కుప్పిలి సాయిరాం,
ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్

ఆపరేషన్ థియేటర్లలో చేతివాటం..!