
కొత్తవలసలో వర్ష బీభత్సం
కొత్తవలస : కొత్తవలసలో ఆదివారం రాత్రి జోరువాన కురిసింది. పట్టణాన్ని వరద నీరు చుట్టుముట్టింది. మూడు రోడ్ల జంక్షన్, రైల్వేస్టేషన్లను వరద నీరు ముంచెత్తడంతో వాహనదారులు, పాదచారుల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మూడు రోడ్ల కూడలిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దసరా సెలవులు ముగియడంతో వేర్వేరు ప్రాంతాలకు పయనమైన వాహనదారులు సుమారు మూడు కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. కొత్తవలస రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణికులు బయటకు వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో స్టేషన్‌లోనే గంటల తరబడి ఉండిపోయారు. రైల్వేస్టేషన్ సమీపంలో అరకు – విశాఖపట్నం జాతీయ రహదారి కోతకు గురైంది. తుమ్మికాపల్లి ఫైర్‌స్టేషన్ సమీపంలో భారీ వృక్షం ఆటోపై కూలడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు.