
తొలి ఏరుకు వేళాయె..
● నేడు పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవం ● సిరిమానోత్సవం రేపు ● పట్టువస్త్రాలను సమర్పించనున్న రాజవంశీకులు
విజయనగరం టౌన్: శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరానికి సర్వం సిద్ధమైంది. అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన విత్తనాలను వేసి నాగలి (ఏరు)తో తొలుత దున్నాలి. దానినే తొలి ఏరు అని... తొలేళ్ల ని పిలుస్తారు. అమ్మవారి సిరిమానోత్సవానికి ముందు రోజు దీన్ని సంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు. పంటకు ఎలాంటి విపత్తులూ, చీడపీడల బాధలు, దరి చేరకూడదనేది రైతు కోరిక. వారి కోసం నిర్వహించేదే తొలేళ్ల ఉత్సవం. తొలేళ్ల రోజు రాత్రి చదురుగుడి నుంచి అమ్మవారి ఘటాలను కోటలోకి తీసుకువెళతారు. అక్కడ కోటశక్తికి పూజలు చేసి, అమ్మవారి ఆశీర్వచనం పొందిన విత్తనాలను బస్తాలతో ఉంచుతారు. సిరిమాను పూజారి చేతులతో ఆ విత్తనాలను అందించి అమ్మవారు ఆశీర్వదిస్తారు. ఆ విత్తనాలను రైతులు తమ బస్తాలలో కలిపి పొలా ల్లో చల్లుతారు. మంచి దిగుబడులు సాధిస్తారు.
విజయాలకు ప్రతీకగా నిలిచిన విద్యల నగరమైన విజయనగరి అమ్మవారి తొలేళ్ల సంబరాలు ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం నుంచి మరుసటి రోజు మంగళవారం మధ్యాహ్నం వరకూ అమ్మవారి దర్శన భాగ్యం భక్తులకు కలిగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు మూడువేల మంది పోలీసు బలగాలను ఉత్సవ విధులకు కేటాయిస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇటు రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి, మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి ప్రాంతమంతా విద్యుత్ శోభతో అలరారుతోంది. మరోవైపు విజయనగర ఉత్సవాల సందడితో చారిత్రాత్మక కట్టడాలన్నీ విద్యుత్ అలంకరణలతో శోభాయామానంగా తయారైంది. మహారా జ కోట, గంటస్తంభం, మహారాజా ప్రభుత్వ సంగీ త, నృత్య కళాశాల, మయూరీ కూడలి నుంచి రైల్వేస్టేషన్ మీదుగా సీఎంఆర్ జంక్షన్ వరకూ విద్యుత్ లైట్లు ఆకట్టుకుంటున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అమ్మవారికి ఘటాలు సమర్పించడంతో పాటూ పసుపు, కుంకుమలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారు ఆలయమంతా పుష్పశోభితంగా విరాజిల్లుతోంది. తల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా ప్రజ లు, అధికారులు సన్నద్ధమయ్యారు.
●వేకువజామున 3 గంటల నుంచి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు.
●ఉదయం రాజవంశీకులు, మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.
●రాత్రి 10.30 గంటలకు భాజాభజంత్రీలతో అమ్మవారి ఘటాలకు పూజలు చేసేందుకు కోటలో కి పూజారులు వెళ్తారు. కోటశక్తికి, అమ్మవారి ఘటాలకు పూజాధికాలు నిర్వహిస్తారు.
●ఘటాలను తిరిగి చదురుగుడి వద్దకు తీసుకువచ్చి గుడి ఎదురుగా ఉన్న బడ్డీలా ఏర్పాటు చేసిన వాటిపై భక్తుల సౌకర్యార్ధం ఉంచుతారు. అమ్మవారి దర్శనానికి అవకాశం లేని వారందరూ అక్కడే పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లిస్తారు.
●ఘటాలను తీసుకువచ్చిన తర్వాత పూజారి అమ్మవారి చరిత్ర చెప్పి రైతులకు ధాన్యాన్ని పంచుతారు. రైతులు ఆ విత్తనాల కోసం బారులు తీరుతారు.