
ఆకట్టుకున్న విద్య, వైజ్ఞానిక ప్రదర్శన
● 166 విద్యాసంస్థల నుంచి 234 సైన్స్ ప్రాజెక్టు నమూనాలు
విజయనగరం అర్బన్: విజయనగర ఉత్సవాల్లో పాఠశాల విద్యార్థులు ఆదివారం ప్రదర్శించిన విద్య వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 166 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ఐటీఐ విద్యాసంస్థల విద్యార్థుల నుంచి 234 సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు. ఇందులో 150 పాఠశాలల నుంచి 182, 15 కళాశాలల నుంచి 32, ఒక ఐటీఐ నుంచి 20 ప్రాజెక్టుల నమూనాలను ప్రదర్శించారు. ప్రదర్శనలో ఉంచిన పలు నమూనాలు సందర్శకులను ఆలోచింపచేశాయి. ఐటీఐ విద్యార్ధులు రూపొందించిన వ్యర్థ ఇనుప పదార్థాల నుంచి సృజనాత్మక పరికరాలు, సోలార్, విండ్ విద్యుత్ ఉత్పాదక నమూనాలు ఆకట్టుకున్నాయి. తాటిపూడి రిజర్వాయర్, భోగాపురం విమానాశ్రయం, దేశంలో ప్రసిద్ధి చెందిన హిందూదేవాలయాల నమూనాలు, డ్రోన్లు, క్రాఫ్ట్, ఆర్ట్ కళల చిత్రలేఖన ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రదర్శనను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎంఎల్‌సీలు డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు, వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, డీఈఓ యూ.మాణిక్యంనాయుడు పాల్గొన్నారు.