
ఆచార, సంప్రదాయాల ప్రకారం... అమ్మవారి జాతర
విజయనగరం: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం, విజయనగరం ప్రజల ఇలవేల్పు పైడితల్లి జాతరను సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు అనుగుణంగా నిర్వహించాల్సిన బాధ్యత ఆలయ అధికారులపై ఉందని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించిన పైడితల్లి అమ్మవారి తొలేళ్లు, సిరిమానోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఏటా నిర్వహించే ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు హాజరుకావడం ఆచారంగా వస్తోందన్నారు. వారందరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. ఇదే సందర్భంలో పండగ రోజుల్లో పెద్దలను గౌరవించుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయంగా పేర్కొన్నారు. ఇందులో భాగంగానే శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ సిరిమాను సంబరాన్ని వీక్షించేందుకు డీసీసీబీ ప్రాంగణంలో కూర్చునేందుకు అవకాశం కల్పించాలంటూ ప్రభుత్వానికి అధికారులకు లేఖ రాశామన్నారు. సుమారు 35 ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం అక్కడ కూర్చొని సంబరాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని లేఖలో కోరామన్నారు. ఈ విషయంపై డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా మీరు ఇక్కడ కూర్చుని సిరిమానోత్సవాన్ని తిలకించడం ఏమిటి? అంటూ పరిపక్వత లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. బొత్స సత్యనారాయణ శాసనమండలిలో విపక్షనేత అని, క్యాబినెట్ హోదా కలిగిన ప్రజాప్రతినిఽధిగా గుర్తించుకోవాలని హితవుపలికారు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకకు వచ్చే ప్రజాప్రతినిధులు తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఉందన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఓ ప్రజాప్రతినిధిగా మాట్లాడే సమయంలో భాషపై సంయమనం కలిగి ఉండాలని, గౌరవ భావంగా వ్యవహరించాలని సూచించారు. శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కోరిన మేరకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పంటనష్ట పోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి...
ఇటీవల ఈదురుగాలులతో కురిసిన వర్షాలకు పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని మజ్జి శ్రీనివాసరావు కోరారు. అరటి, చెరకు, బొప్పాయి, కూరగాయల పంటలతో పాటు వందల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. గడిచిన 48 గంటలుగా చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ శాఖ అధికారులు విరిగిపోయిన స్తంభాల స్థానంలో కొత్తవాటిని వేసి సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పి.జైహింద్‌కుమార్ పాల్గొన్నారు.
క్యాబినెట్ హోదా
కలిగిన బొత్సకు
జాతరలో ప్రాధాన్యం ఇవ్వాలి
సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
పంట నష్ట పోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు