
ఉత్సవాల నిర్వహణకు క్రెడాయ్ రూ. 7.01 లక్షల విరాళం
విజయనగరం: ఏటా జిల్లా యంత్రాగం ఆధ్వర్యంలో నిర్వహించే విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి జాతరకు భవన నిర్మాణ రంగ సంస్థ క్రెడాయ్ తమవంతుగా రూ.7.01లక్షల ఆర్థిక సహాయం చేసింది. సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.సుభాష్ చంద్రబోష్, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, కార్యదర్శి సురేంద్ర శనివారం చెక్కు రూపంలో ఆ మొత్తాన్ని జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పల్లి నల్లనయ్యకు అందజేశారు. కార్యక్రమంలో క్రెడాయ్ జిల్లా ప్రతినిధులు అర్జున్, రవి, తదితరులు పాల్గొన్నారు.
వరద నీరు విడుదల
వంగర: మండలంలోని మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 8వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు వద్ద 64.20 మీటర్ల మేర నీటిమట్టం నమోదైంది. రెండు గేట్లు ఎత్తివేసి వరద నీటిని దిగువకు విడిచిపెడుతున్నట్టు ఏఈ నితిన్ తెలిపారు.
ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తాం
విజయనగరం అర్బన్: పైడితల్లి సిరిమానోత్సవం వీక్షించేందుకు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు ప్రత్యామ్నాయ స్థలం చూస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. స్థానిక విలేకరులతో ఆయన శనివారం మాట్లాడారు. డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో వీక్షణకు స్థలం కావాలని అధికారులను ఆయన కోరారని, అయితే డీసీసీబీ పాలక మండలి డైరెక్టర్లు కూడా ఆ స్థలంలోనే తిలకిస్తామని కోరడంతో ఆయనకు కేటాయించలేమని స్పష్టం చేశారు. నిబంధనల మేరకు ఆయనకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తామని అన్నారు. అమ్మవారి పండగను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
త్వరితగతిన తుఫాన్ నష్టాల అంచనా
విజయనగరం అర్బన్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన పంట నష్టాలను, రోడ్లు, విద్యు త్ తదితర ఆస్తి నష్టాలను అంచనావేసి వెంటనే నివేదిక అందజేయాలని జిల్లా అధికారులకు కలెక్టర్ డాక్టర్ ఎస్.రామసుందర రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఎటువంటి వివాదాలకు తావులేని కచ్చితమైన, పారదర్శకమైన అంచనాలు వేయాలని సూచించారు. యూరి యా సరఫరా, భారీవర్షాలు, జీఎస్టీ తగ్గింపుపై అవగాహన సదస్సుల నిర్వహణ, తదితర అంశాలపై జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా సరఫరాపై వ్యవసాయ శాఖ అధికారుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. సక్రమంగా పంపిణీ జరిగేలా చూడాలన్నారు. సూపర్ జీఎస్‌టీపై ఏ రోజు షెడ్యూల్ ఆ రోజు పాటించాలని సూచించారు. వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తగ్గుముఖం పట్టిన ‘తోటపల్లి’
గరుగుబిల్లి: తోటపల్లి ప్రాజెక్టు వద్ద వరదనీటి ప్రవాహం క్రమేపీ తగ్గుముఖంపడుతోంది. శుక్రవారం ఉదయం ప్రాజెక్టులోకి 44వేల క్యూసెక్కుల వరదనీరు చేరగా.. శనివారం సాయంత్రం నాటికి వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతూ 11,637 క్యూసెక్కులకు చేరింది. అధికారులు స్పిల్‌వే వద్ద మూడు గేట్లను ఎత్తివేసి 10,617 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెట్టారు.

ఉత్సవాల నిర్వహణకు క్రెడాయ్ రూ. 7.01 లక్షల విరాళం

ఉత్సవాల నిర్వహణకు క్రెడాయ్ రూ. 7.01 లక్షల విరాళం

ఉత్సవాల నిర్వహణకు క్రెడాయ్ రూ. 7.01 లక్షల విరాళం