
పంట భూములను నాశనం చేయొద్దు
● ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా గళమెత్తిన ప్రజలు
● ప్రజాభిప్రాయ సేకరణలో తీవ్ర వ్యతిరేకత
చీపురుపల్లిరూరల్(గరివిడి): ఏటా పంటలు పండే భూముల్లో ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమ ఏర్పాటుచేసి ఉపాధిని దూరం చేసి జీవితాలను నాశనం చేయొద్దంటూ గరివిడి మండలంలోని కుమరాం, కె.పాలవలస, కందిపేట, తాటిగూడ, విజయరాంపురం పరిసర ప్రాంతాల యువత, ప్రజలు గోడు వినిపించారు. పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా గళమెత్తారు. గరివిడి మండలం కుమరాం పంచాయతీ పరిధిలో శోభా మెటల్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో సర్వే నంబర్ 136/1,136/5,136/5ఎలో ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు శనివారం చేపట్టింది. డీఆర్వో శ్రీనివాసమూర్తి, కాలుష్య నియంత్రణ మండలి చీఫ్ ఇంజినీర్ రామారావునాయుడు, తహసీల్దార్ సీహెచ్ బంగార్రాజు హాజరై ప్రజల అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు నియమ నిబంధనలు అనుసరించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని పరిశ్రమ ఏర్పాటు చేయాలని తెలపగా, మరికొందరు పరిశ్రమ వద్దని స్పష్టం చేశారు. పరిశ్రమకు అవసరమైన నీటికోసం పెద్దఎత్తున బోర్లు తవ్వితే వ్యవసాయ బోర్లు ఎండిపోతాయని, సాగు కష్టాలు తప్పవని పాలవలస సర్పంచ్ మీసాల ప్రసాదరావు అభిప్రాయం తెలిపారు. మూతపడిన గరివిడి ఫేకర్ పరిశ్రమను లీజుకు తీసుకుని కొనసాగిస్తే యువతకు ఉపాధి కలుగుతుందని మరికొందరు పేర్కొన్నారు. పరిశ్రమల పేరుతో పంట భూములను నాశనం చేయొద్దని స్థానికులు గోవింద్, రఘుమండ రవికుమార్, ముల్లు సత్యనారాయణ తెలిపారు. తాటిగూడకు చెందిన పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బూత్‌కమిటీ వింగ్ జాయింట్ సెక్రటరీ ఎడ్ల అప్పారావు మాట్లాడుతూ నీటిని కలుషితం చేసే పరిశ్రమ మాకొద్దని తెగేసి చెప్పారు.

పంట భూములను నాశనం చేయొద్దు