
అమ్మ అనుగ్రహంతోనే...
● తొమ్మిదోసారి సిరిమానును అధిరోహించడం అదృష్టం
● భక్తులందరూ
పైడితల్లిని దర్శించండి
విజయనగరం టౌన్: చింతమానును సిరిమానుగా మలుచుకుని సిరులతల్లి పురవీధుల్లో విహరిస్తూ తన చల్లని చూపులతో అక్షితలను చేతబట్టిన పూజారి రూపంలో భక్తులకు ఆశీర్వచనాలను అందిస్తుంది. అమ్మవారి ఆశీస్సులు అందుకునేందుకు లక్షలాది మంది భక్తులు రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివస్తారు. ఈ బృహత్తర ఘట్టమైన సిరిమానును బంటుపల్లి వెంకటరావు వరుసగా తొమ్మిదోసారి అధిరోహించనున్నారు. అతి పిన్నవయసు నుంచే సిరిమాను అధిరోహించే అవకాశం అందుకున్న పూజారిగా ఘనతకెక్కారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో శనివారం మాట్లాడారు.
తల్లిసేవలోనే..
చిన్నప్పటి నుంచి నాన్న బంటుపల్లి బైరాగినాయుడు అత్యధికంగా 28 సార్లు సిరిమానును అధిరోహించారు. ఆయనతో పాటు సిరిమాను ఉత్సవాల్లో పాల్గొని 24 గంటలూ తల్లిసేవలో తరించడం ఆనవాయితీగా వచ్చింది. ఆయన తర్వాతకాలంలో మేనమామ నేతేటి శ్రీనివాస్, తాళ్లపూడి భాస్కరరావు సిరిమానును అధిరోహించారు. అప్పుడు మరింతగా అమ్మవారికి సేవచేసుకునే భాగ్యం కలిగింది. వారి తర్వాత మరలా 2017లో తొలిసారిగా సిరిమానును అధిరోహించాను. ఎనిమిదేళ్లు పూర్తిచేసుకున్నాను. ఈ ఏడాది తొమ్మిదో ఏట సిరిమానును అధిరోహిస్తుండడం పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నాను.
సిరిమానును వీక్షించి.. తరించండి
సిరుల తల్లి సిరిమానోత్సవాన్ని భక్తులందరూ వీక్షించి, ఆమె దీవెనలు అందుకోవాలి. నెలరోజుల పండగలో పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకోవాలి. హుకుంపేట ప్రజలందరితో కలిసి అమ్మవారికి చల్లదనం చేశాం. ఘటాలతో నివేదన చేశాం. సిరిమానోత్సవానికి సంబంధించి నిర్ణీత సమయానికి సిరిమాను ఆలయానికి చేరుకునేలా పర్యవేక్షిస్తున్నాం.
ఉత్సవానికి సిరిమాను, ఇరుసుమాను రెడీ
అక్టోబర్ 6న నిర్వహించే తొలేళ్ల ఉత్సవం, అక్టోబర్ 7న సిరిమానోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేసుకున్నాం. సిరిమాను మలి చే ప్రక్రియ పూర్తికావచ్చింది. ఇరుసుమాను, గిలక, రథం పనులు పూర్తయ్యాయి. పెయింటింగ్‌లు పూర్తిచేసుకోవడమే మిగిలింది. అంజలి రథం, బెస్తరవారివల, తెల్ల ఏనుగు, పాలధారను అమ్మవారిమీద ఉండే భక్తితో వారి వంశపారంపర్యంగా వస్తున్న సంప్రదాయంతో ఉత్సవానికి సమయానికి తీసుకువస్తారు.