
విజయనగర వైభవం ఉట్టిపడేలా..
సాక్షిప్రతినిధి, విజయనగరం: కళలకు కాణాచి.. విద్యలకు నిలయం... సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన విజయనగరం ఉత్సవాలకు సన్నద్ధమవుతోంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విజయనగరం వైభవం ఉట్టిపడేలా విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి జాతర మహోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 5న విజయనగరం ఉత్సవాలు ప్రారంభం కానుండగా... 6వ తేదీ వరకు కొనసాగుతాయి. అదే రోజు పైడితల్లమ్మవారి తొలేళ్ల ఉత్సవం ప్రారంభం కానుంది. 7న జాతర మహోత్సవంలో కీలకమైన అమ్మవారి సిరిమాను సంబరం జరగనుంది. రెండు ఉత్సవాలను తిలకించేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు తరలి వస్తుండగా... వారికి కనుల విందు చేసేందుకు 11 వేదికల్లో వివిద సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
వేదికలు... కార్యక్రమాలు ఇలా...
● ఈ నెల 5వ తేదీ ఉదయం 8 గంటలకు కోట ఎదురుగానున్న బొంకులదిబ్బ వద్ద విజయనగరం ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుక జరగనుంది.
● అయోధ్యామైదానంలో 5వ తేదీ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పెట్ షో నిర్వహించనున్నారు.
● మహారాజా కోటలో 5, 6వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సైన్స్ ఫెయిర్, స్టాంప్స్ అండ్ కాయిన్స్ ఎగ్జిబిషన్, ఆర్ట్ గ్యాలరీ జరుగుతుంది.
● 5వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు (రంజిని, శివరంజిని థియేటర్ ఎదురుగా) విజయనగరం వైభవంపై ‘లేజర్ షో ప్రదర్శిస్తారు. అంతేకాకుండా విజయనగరంలోని ప్రముఖ స్థలాల, కట్టడాలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు.
● కోట ఎదురుగా ఉన్న బొంకుల దిబ్బపై 5, 6వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కన్యాశుల్కం, సీతాకళ్యాణం, మోహినీ భస్మాసుర, సత్యహరిశ్చ్రంద ప్రదర్శన ఉంటుంది.
● 6వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కోట ప్రధాన ద్వారం సమీపంలో పులివేషాల ప్రదర్శన జరుగుతుంది.
● గురజాడ కళాభారతిలో ఈ నెల 5, 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్థానిక కళాకారుల నాటకాలు, వేదిక, బ్యాక్‌డ్రాప్‌లను వెలిగించడం, వేదిక ప్రదర్శనలు, అలంకరణ, హోర్డింగుల ప్రదర్శన ఉంటుంది.
● క్రీడోత్సవంలో భాగంగా విజ్జి స్టేడియంలో 5, 6వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బాడ్మింటన్, ఫుట్‌బాల్, టెన్నీస్, చెస్ క్రీడా పోటీలు నిర్వహిస్తారు.
● మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో 5, 6 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత, నృత్య పోటీలు జరుగుతాయి.
● ఎం.ఆర్.లేడీస్ రిక్రియేషన్ అండ్ వెల్ఫేర్ క్లబ్‌లో 5, 6 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పుస్తక ప్రదర్శన, చారిత్రక కథనాలు, ప్రముఖులకు సంబంధించిన ఛాయాచిత్రాలు, శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి పుస్తకాల ప్రదర్శన ఉంటాయి.
● లయన్స్ కమ్యూనిటీ హాలులో 5, 6వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డాక్యుమెంటరీ ప్రదర్శన, జానపద కళాకారుల (గిరిజన కళాకారుల)లో నృత్యాలు, స్ట్రీట్ ఫైట్, కత్తిసాము, పులివేషాలు, డప్పు ప్రదర్శన, జముకుల కధ, రేలారే రేల, కోలాటాలు, తప్పెటగుళ్లు, బురక్రథ, తూర్పు భాగోతం వంటి అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.
● లోయర్ ట్యాంక్‌బండ్ రోడ్డులో గల మాన్సాస్ గ్రౌండ్‌లో ఈ నెల 8 వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జాతీయ స్థాయి సరస్ మేళా ఏర్పాటు చేస్తారు.
● 5, 6వ తేదీ ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పుష్ప, ఫల ప్రదర్శన ఉంటుంది.
5, 6, 7 తేదీల్లో విజయనగరం
ఉత్సవాలు, పైడితల్లి జాతర
11 వేదికల్లో సాంస్కృతిక కార్యక్రమాలు
అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు

విజయనగర వైభవం ఉట్టిపడేలా..