
చంద్రబాబు పథకాలన్నీ కాపీ పేస్ట్
సాక్షి, విశాఖపట్నం:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, నవ్యాంధ్రప్రదేశ్‌లో కలిపి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. సొంతంగా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని వైఎస్సార్ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్, కేకే రాజు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను, పొరుగు రాష్ట్రాల పథకాలను ఆయన కాపీ పేస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నామని వారు స్పష్టం చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి నేతలు ఉత్తరాంధ్ర వనరులను కొల్లగొడుతున్నారని, విశాఖలో సదస్సులు నిర్వహించి, పెట్టుబడులను మాత్రం అమరావతికి తరలిస్తున్నారని ఆరోపించారు. అమరావతిపై ఉన్న ప్రేమతో చంద్రబాబు ఉత్తరాంధ్రపై వివక్ష చూపుతూ.. ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి బాట పట్టిన ఉత్తరాంధ్ర.. నేటి కూటమి పాలనలో భ్రష్టుపట్టిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర విస్తృత స్థాయి సమావేశం
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 10 గంటలకు భీమిలి నియోజకవర్గం పెద్దిపాలెంలోని చెన్నా కన్వెన్షన్ సెంటర్‌లో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు అమర్‌నాథ్, కేకే రాజు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించి.. భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వంటి కీలక అంశాలపై చర్చిస్తామన్నారు. మూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్‌పోర్ట్ వంటి ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, అరకు ఎంపీ జి.తనూజారాణి, మాజీ మంత్రులు, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరవుతారని తెలిపారు.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై పోరాటం
పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారని, వాటిలో పది కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని అమర్‌నాథ్, కేకే రాజు మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 9న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం వైద్య కళాశాలను సందర్శించి, నిర్మాణ పనులను పరిశీలిస్తారని వారు వెల్లడించారు.
ఉత్తరాంధ్ర వనరులను
దోచుకుంటున్నారు
అమరావతిపై ప్రేమతో ఈ ప్రాంతానికి అన్యాయం
స్పీకర్ పదవికి అయ్యన్న అనర్హుడు
ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి సిద్ధం
వైఎస్సార్ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్,
కేకే రాజు
స్పీకర్ అయ్యన్నపై విమర్శలు
స్పీకర్ పదవికి అయ్యన్నపాత్రుడు అనర్హుడని అమర్‌నాథ్, కేకే రాజు అన్నారు. ‘అయ్యన్నలో కనీసం ఒక్క మంచి లక్షణం కూడా లేదు. అబద్దాలు, అర్థం లేని మాటలు మాట్లాడటం ఆయన నైజం’అని విమర్శించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్, చింతలపూడి వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.