
నవంబరు 30న విజయవాడలో కాపుల భారీ సభ
కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం
మధురవాడ: కాపుల ఉనికి, శక్తిని చాటే విధంగా నవంబరు 30న విజయవాడలో భారీ సభ నిర్వహిస్తున్నట్లు కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం తెలిపారు. దివంగత మిరియాల వెంకటరావు నాయకత్వంలో ఏర్పాటైన కాపు ఉద్యమం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మధురవాడ ఎన్‌వీపీ లా కాలేజీ ఇందిరా విహార్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన కాపునాడు జోన్–1 శ్రీకాకుళం, విజయనగరం, అరకు, విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. 24 శాతం ఓటింగ్‌కు అనుగుణంగా స్థానిక సంస్థల్లో కాపులకు సీట్లు ఇవ్వాలని, విశాఖలో కాపు భవనం నిర్మాణానికి అవకాశం కల్పించాలని, కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కాపునాడులో ఏ పార్టీ వారైనా ఉండవచ్చన్నారు. ఇటీవల చంద్రబాబు రాయలసీమలోని గిరి బలిజ పేరుతో ఒక కులాన్ని బీసీలో చేర్చారని, దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో దానిపై స్టేటస్‌కో వచ్చిందన్నారు. విజయవాడ సభకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ని ఆహ్వానిస్తారా అని మీడియా ప్రశ్నించగా.. ఆహ్వానిస్తామని సుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే ఆయన వచ్చే అవకాశం లేదన్నారు. కాపు నాయకులు కర్రి వెంకటరమణ, పాండ్రంకి జయరాజు, నీరుకొండ రామచంద్రరావు, శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు.