
సమ్మోహనం.. నృత్యవిన్యాసం
మద్దిలపాలెం: ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి, బంగారు పతక విజేత అరుణ పరమేశ్ స్థాపించిన సంయుక్త మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ 8వ వార్షికోత్సవం ఆదివారం కళాభారతి ఆడిటోరియంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకలో 60 మందికి పైగా శిష్యులు కూచిపూడి నృత్య విన్యాసాలతో అద్భుత ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గణబాబు మాట్లాడుతూ.. భారతీయ శాసీ్త్రయ కళల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా తరహాలో.. కల్చరల్ కోటాను ప్రవేశపెట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలనే ఆలోచనను వ్యక్తం చేశారు. కూచిపూడి నాట్య నిపుణురాలు సూదగాని గీతా నారాయణ్ చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ‘బ్రహ్మాంజలి’, ‘భో శంభో’, ‘వాలపుల సోలపుల’ వంటి నృత్యరూపకాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఐసీసీఆర్ సౌత్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, ఎన్‌ఎండీఏ ప్రిన్సిపాల్ కె.వి.లక్ష్మి, తేజశ్రీ తదితరులు పాల్గొన్నారు.