
బీసీఐ ఎన్నికల నిబంధనలు సడలించాలి
వైఎస్సార్ సీపీ లీగల్ సెల్
రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా
అల్లిపురం: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ఎన్నికల నిబంధనలను సడలించాలని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఎన్నికల నియమ నిబంధనల్లో ముఖ్యమైన రూ.1,25,000 నామినేషన్ ఫీజు మధ్య తరగతి న్యాయవాదులకు ఆర్థిక భారమని ఆయన అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు లేని ఈ నిబంధనలు.. బార్ కౌన్సిల్ ఎన్నికలకు ఎందుకని ప్రశ్నించారు. ఈ నిబంధన వల్ల డబ్బున్న న్యాయవాదులు మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం దక్కుతుందని, మధ్య తరగతి న్యాయవాదులకు పోటీ చేసే హక్కు లేదా అని నిలదీశారు. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ న్యాయవాదులు పోటీలో లేకుండా చేయాలనే కుట్రపూరితమైన జీవో అని పాకా ఆరోపించారు. ఈ నిబంధనను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ న్యాయవాదులు ఎన్నికల్లో పోటీ చేసే విధంగా జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న బార్ కౌన్సిల్ సభ్యులు ఈ జీవోపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. జిల్లాల బార్ అసోసియేషన్లు, బార్ కౌన్సిల్ సభ్యులు అత్యవసర సమావేశాలు నిర్వహించి,.. ఒక తీర్మానం చేసి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పంపాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం జీపీలు, ఏజీపీలు, పీపీలు, ఏపీపీలు, స్పెషల్ పీపీలు నియామకాల్లో అన్ని సామాజిక వర్గాల ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.