
గిరిజన విద్యార్థులకు మెరుగైన వైద్యం
మహారాణిపేట: కురుపాం గిరిజన బాలికల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఆదివారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు. పాఠశాలలో మొత్తం 129 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, అందులో 37 మందిని కేజీహెచ్‌కు తరలించామని మంత్రి తెలిపారు. బాలికలు జాండీస్, జ్వరంతో బాధపడుతున్నారని, కొందరిలో హెపటైటిస్–ఏ ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన వైద్యం అందుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్‌లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశామని, మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉందని మంత్రి తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, ఎవరి తప్పిదం ఉన్నా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.