ఉత్తరాంధ్ర సమస్యలపై సమరభేరి | - | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్ర సమస్యలపై సమరభేరి

Oct 6 2025 6:27 AM | Updated on Oct 6 2025 9:02 AM

సమరభే

సమరభేరి

కూటమి సర్కారు వైఫల్యాలపై ఉద్యమించనున్న వైఎస్సార్‌సీపీ

ఉత్తరాంధ్ర విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతల తీర్మానం

ఏడు అంశాలపై ప్రజలకు న్యాయం జరిగే వరకు రాజీలేని పోరాటం

9న నర్సీపట్నం మెడికల్‌ కాలేజీని సందర్శించనున్న వైఎస్‌ జగన్‌

విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో

భీమబోయినపాలెం చేరుకోనున్న మాజీ సీఎం

ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై 7 తీర్మానాలు

సాక్షి, విశాఖపట్నం: దిక్కులేని ప్రజల గొంతుకై .. వారి తరపున పోరాటానికి సిద్ధమై.. వాయిస్‌ ఫర్‌ ది వాయిస్‌లెస్‌గా నిలుస్తూ.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్‌ సీపీ కూటమి సర్కారుకు అల్టిమేటం ఇచ్చింది. ప్రభుత్వం తప్పులు, వైఫల్యాలను ఇకపై ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సమరశంఖం పూరించాలని నిర్ణయించినట్టు పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్‌ కోఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఆదివారం ఆనందపురంలోని పెద్దిపాలెంలో ని చెన్నాస్‌ కన్వెన్షన్‌ హాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్‌ సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. తొలుత మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించి సమావేశం ప్రారంభించారు. ఈ సమా వేశంలో కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరొస్తుందనే భయంతో ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా 17 మెడికల్‌ కాలేజీలు మొదలుపెట్టి 7 కాలేజీలను పూర్తి చేశారని, వాటిని కూడా ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు తన వారి చేతుల్లో పెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయాలని వైఎస్సార్‌ సీపీ నిర్ణయించిందన్నారు. ఉత్తరాంధ్ర నుంచే సమరశంఖం పూరించేందుకు ఈ నెల 9న నర్సీపట్నం మెడికల్‌ కాలేజీని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించనున్నారని చెప్పారు. అక్కడే ప్రజలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడతారని వివరించారు.

కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, ధర్మాన కృష్ణదాస్‌, పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్సీలు నర్తు రామారావు, సురేష్‌బాబు, కుంభా రవిబాబు, పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, జెడ్పీ చైర్‌పర్సన్లు జె.సుభద్ర, పిరియా విజయ, పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు, పార్లమెంట్‌ సమన్వయకర్తలు బొడ్డేడ ప్రసాద్‌, బెల్లాన చంద్రశేఖర్‌, పార్లమెంట్‌ పరిశీలకులు కదిరి బాబూరావు, శోభా హైమావతి, సూర్యానారాయణ రాజు, మాజీ ఎంపీలు భీశెట్టి వెంకటసత్యవతి, గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్ర స్వామి, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, కన్నబాబు రాజు, తిప్పల నాగిరెడ్డి, గొర్లె కిరణ్‌కుమార్‌, తైనాల విజయ్‌కుమార్‌, చింతలపూడి వెంకట్రామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, చెట్టి ఫాల్గుణ, పిరియా సాయిరాజు, విశ్వసరాయి కళావతి, కె.భాగ్యలక్ష్మి, చెంగల వెంకట్రావ్‌, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, మలసాల భరత్‌కుమార్‌, పేరాడ తిలక్‌, చింతాడ రవికుమార్‌, రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మణరావు, కరిమి రాజేశ్వరరావు, సాడి శాంప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు చింతకాయల సన్యాసిపాత్రుడు, చిక్కాల రామారావు, పైల శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర మహి ళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈర్లె అనురాధ, రాష్ట్ర క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు జాన్‌ వెస్లీ, సీఈసీ సభ్యులు కోలా గురువులు, కాయల వెంకటరెడ్డి, ఎస్‌ఈసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి
శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటే, మనం చేసే ప్రతీ కార్యక్రమం ప్రజల్లోకి వెళుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న జిల్లా, మండల కమిటీలను, గ్రామ ఇన్‌చార్జిల నియామకాలను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘స్వాతంత్య్రం అనంతరం ఉత్తరాంధ్రకు మేలు చేసిన ముఖ్యమంత్రులు వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే. మూలపేట పోర్టు, ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు వైఎస్సార్‌ సీపీ హయాంలోనే వచ్చాయి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, దొరికిన ప్రతీ అంశాన్ని మనం ప్రశ్నించాలి. స్థానిక అంశాలపై దృష్టి సారించాలి. యువ నాయకత్వం పార్టీ బలోపేతానికి కృషి చేసి, నాయకులుగా ఎదగాలి.’అని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వరుదు కల్యాణి మాట్లాడుతూ స్థానిక కమిటీల్లో మహిళలకు సమన్వయకర్తలు ప్రాధాన్యమివ్వాలని కోరారు. స్థానిక సమస్యలపై విస్తృతంగా పోరాటం చేయాలని మహిళలకు పిలుపునిచ్చారు. అరకు ఎంపీ తనూజరాణి మాట్లాడుతూ..ప్రతీ నియోజకవర్గంలో సమన్వయకర్త సమక్షంలో నియోజకవర్గ స్థాయి సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. వాటిని పరిష్కరించే వరకూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా పోరాటం చేయాలని సూచించారు.

ప్రభుత్వ భూముల కేటాయింపుపై..

లులూ వంటి సంస్థలకు కారుచౌకగా భూములు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఉన్న విలువైన భూములను కారుచౌకగా కార్పొరేట్‌ సంస్థలకు కూటమి ప్రభుత్వం కట్టబెడుతోంది. వైఎస్సార్‌ సీపీ హయాంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి పనులకు, ట్రైబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ కోసం భూసేకరణ చేపట్టాం. దానిపై చాలా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు లులూ వంటి అడ్రస్‌ లేని కార్పొరేట్‌ సంస్థలకు ఖరీదైన భూములను అప్పగిస్తున్నారు.’అని అన్నారు.

చిరు వ్యాపారుల తొలగింపునకు వ్యతిరేకంగా..

జీవీఎంసీ పరిధిలో 42 వేల మంది చిరు వ్యాపారుల షాపులను, ఫుడ్‌కోర్టులను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్‌, మళ్ల విజయప్రసాద్‌ మద్దతు పలికారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం చిరువ్యాపారుల కుటుంబాలను రోడ్డున పడేసింది. హాకర్లకు ఏయూ స్థలంలో వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తామని మభ్యపెడుతున్నారు. దీన్ని వైఎస్సార్‌ సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. వ్యాపారులకు న్యాయం జరిగేదాకా పోరాడుతాం.’ అని అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి, మళ్ల మాట్లాడుతూ.. ‘ చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చేసి కూటమి ప్రభుత్వం వారి పొట్టకొట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలున్నప్పటికీ క్రూరంగా వ్యవహరించారు. పార్టీ ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement