
సాగునీటి ప్రాజెక్టులపై..
ఉత్తరాంధ్రలో పెండింగ్‌లో ఉన్న వంశధార, జంఝావతి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి వంటి సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ‘వంశధార రిజర్వాయర్ నుంచి ఉద్దానం ప్రాంతానికి మంచి నీటి సరఫరా ప్రాజెక్ట్‌కు వైఎస్సార్ సీపీ ప్రారంభించింది. పలాస నియోజకవర్గంకు పూర్తి స్థాయిలో శుద్ధ జలం అందించాం. మిగిలిన పనులు పూర్తి చేయాలి. వైఎస్సార్ సీపీ హయాంలో మూలపేట పోర్టు పనులు 90 శాతం పూర్తయ్యాయి. 1995లో ప్రారంభమైన వంశధార ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి.’ అని అన్నారు. ఈ తీర్మానానికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. సాగు నీరు అందకపోవడంతో అనకాపల్లి జిల్లాలో చెరకు, వరి సాగు తగ్గిపోయిందన్నారు. జిల్లాలోని ఐదు షుగర్ ఫ్యాక్టరీల్లో చోడవరం ఒకటే మిగిలిందని, దానికి కూడా కాపాడుకోలేదని పరిస్థితి నెలకొందన్నారు.