
నగర సుందరీకరణ పనులు సత్వరం పూర్తి చేయండి
డాబాగార్డెన్స్: నగరంలో జరగనున్న పార్టనర్ షిప్ సమ్మిట్‌కు ముందు నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనులను త్వరగా పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ అధికారులను ఆదేశించారు. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు రానున్నందున, నగరాన్ని మరింత సుందరంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ కేతన్ గార్గ్, ప్రధాన ఇంజనీర్ సత్యనారాయణరాజు, ఇతర అధికారులతో కలిసి ఆర్కే బీచ్, పార్క్ హోటల్, సిరిపురం వంటి ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్ వద్ద డ్రోన్ కెమెరా ద్వారా పలు ప్రాంతాలను పరిశీలించి, అభివృద్ధి పనులపై ఇంజనీర్‌కు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా బీచ్‌రోడ్డులో చేపట్టాల్సిన సుందరీకరణ పనులను కమిషనర్ వివరించారు. వీటిలో ముఖ్యంగా ఫుట్‌పాత్ కర్బ్‌వాల్స్ మరమ్మతులు, పెయింటింగ్‌లు, స్టడ్స్ ఏర్పాటు పనులు సత్వరం పూర్తి చేయాలన్నారు. మొక్కల ఏర్పాటు, విద్యుత్ అలంకరణ, వీధిలైట్ల మరమ్మతులు వెంటనే చేయాలని ఆదేశించారు. సమ్మిట్ పూర్తయ్యే వరకు జీవీఎంసీ అధికారులు, సంబంధిత విభాగాలు సమన్వయంతో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు తరచూ సమన్వయ సమావేశాలు నిర్వహించి పనులను పర్యవేక్షించాలని ప్రధాన ఇంజనీర్‌కు సూచించారు. పర్యటనలో జోనల్ కమిషనర్లు కె.శివప్రసాద్, మల్లయ్యనాయుడు, పర్యవేక్షక ఇంజినీర్లు సంపత్‌కుమార్, కె.శ్రీనివాసరావు, రాయల్ బాబు, పాల్గొన్నారు.