
పడవ బోల్తాపడి మత్స్యకారుడి మృతి
ఆరిలోవ: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు పడవ బోల్తాపడి మృత్యువాతపడ్డాడు. ఆరిలోవ ఎస్‌ఐ రాందాస్ తెలిపిన వివరాల మేరకు.. జీవీఎంసీ 9వ వార్డు పరిధి జోడుగుళ్లుపాలేనికి చెందిన గరికిన నూకరాజు(36) శుక్రవారం చేపల వేటకు పడవపై బయలుదేరాడు. తిరిగి ఒడ్డుకు చేరుకునే సమయంలో సముద్రంలో ప్రవాహం, అలల తాకిడి అధికంగా ఉండటంతో పడవ బోల్తాపడింది. దీంతో నూకరాజు నీటిలో మునిగిపోయి మరణించాడు. అలలపై తేలియాడతున్న అతని మృతదేహాన్ని గమనించిన స్థానిక మత్యకారులు గరికన నర్సింగ్, అప్పలరాజు ఒడ్డుకు చేర్చారు. మృతుడి తండ్రి గరికిన గురుమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్ మార్చురీకి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.