
కొత్త పింఛన్లు కష్టమే..!
కూటమి ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలైనా కొలిక్కిరాని కొత్త పెన్షన్లు ఇప్పటి వరకు ఒకరికి కూడా పెన్షన్ మంజూరు చేయని ప్రభుత్వం సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వికలాంగ, వితంతు, వృద్ధులు దరఖాస్తులు తీసుకోవడానికి కూడా అంగీకరించని సచివాలయ సిబ్బంది
మహారాణిపేట: కూటమి సర్కార్ కొలువుదీరి 16 నెలలు కావస్తున్నా.. కొత్త పింఛన్ల ఉసే ఎత్తడం లేదు. ఎన్నికల ముందు 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు, వివిధ కేటగిరీలకు చెందిన దివ్యాంగులకు పింఛన్లు ఇస్తామని ఎన్నికల ప్రచార సభల్లో బాకాలు ఊదారు. కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక కనీసం దరఖాస్తులు కూడా స్వీకరించే పరిస్థితి లేదని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో ఈ దరఖాస్తులే ఎక్కువంటే అతిశయోక్తి కాదు. ఇంటి సమీపంలో ఉన్న సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. ఫలితం కానరావట్లేదని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వాపోతున్నారు.
దివ్యాంగ పింఛన్లకు ఎసరు
సామాజిక పింఛన్లు తీసుకుంటున్న పలు కేటగిరీల్లోని దివ్యాంగులపై కూటమి సర్కార్ కక్ష గట్టింది. సామాజిక పింఛన్లు తీసుకునేవారిపై ర్యాండప్ సర్వేతో లబ్ధిదారులను తగ్గించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సదరం సర్టిఫికెట్ల రీ వెరిఫీకేషన్ పేరిట పింఛన్ల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో వివిధ కేటగిరీల్లో 1,60,200 మంది పింఛన్లు పొందుతున్నారు. వివిధ రకాలైన దివ్యాంగులు 21,306 మంది ఉన్నారు. వీరికి కేటగిరీ వారీగా రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.8 వేలు, రూ.6 వేలు చొప్పున పింఛన్ అందిస్తున్నారు. ఇందులో 16,187 మందికి రీ వెరిఫికేషన్ పూర్తయింది. ఇంకా 5,119 మంది దివ్యాంగులకు రీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. వీరిలో కొందరు రీ వెరిఫికేషన్‌కు హాజరు కాలేకపోయారు. దీంతో 1,579 మందికి పింఛన్ నిలిపేశారు. ఇందులో తమ పనులు తాము చేసుకోలేని వారు కూడా ఉన్నారు.
గత ప్రభుత్వంలో ఏటా రెండుసార్లు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్లు ఇచ్చేవారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోయేది. చాలా వరకు ఇంటికే వచ్చి వలంటీర్లు దరఖాస్తులు తీసుకునేవారు. ఏటా జనవరి, జూలై నెల్లో అర్హులను ఎంపిక చేసి, ఆ మరుసటి నెల నుంచే పింఛన్ మొత్తం అందించేవారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 16 నెలలవుతున్నా కొత్తగా ఒక్క పింఛన్ కూడా ఇచ్చిన దాఖలాల్లేవు.
50 ఏళ్లకే పింఛన్ ఏమైంది?
సూపర్–6 హామీల్లో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని మేనిఫెస్టోలో చేర్చారు. ఇప్పుటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించట్లేదు. ఇప్పుడు సూపర్ సిక్స్–సూపర్ హిట్ అంటూ కూటమి నేతల హడావుడి ప్రజల్లో నగుబాటుకు గురవుతోంది. కొత్త పింఛన్ కోసం సచివాలయాల్లోకి వెళ్తే 50 ఏళ్ల కేటగిరీపై ఇంకా ఆప్షన్ రాలేదని చెప్పి, సిబ్బంది వెనక్కి పంపుతున్నారు. పింఛన్ల కోసం గతంలో దరఖాస్తులు పెద్ద సంఖ్యలో వచ్చాయి. వాటిని ఇంకా విచారణే చేయలేదు. ఇలాంటి సమయంలో కొత్త దరఖాస్తులు ఎలా స్వీకరించేందంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
‘దివ్యాంగుల’నేతకే కోత
దివ్యాంగుల హక్కులు, సమస్యలపై పోరాటం చేస్తున్న వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అక్కిరెడ్డి అప్పారావు పింఛన్‌కే ఎసరెట్టారు. 2003లో విశాఖ విమానాశ్రయ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పారావు తీవ్రంగా గాయపడ్డారు. ఎడమ కాలు దెబ్బతినడంతో మోకాలి వరకు తొలగించారు. ఈ నేపథ్యంలో అప్పారావుకు 60 శాతంతో సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. మొత్తం మూడుసార్లు సదరం సర్టిఫికెట్ తీసుకున్నారు. ఇప్పుడు పింఛన్ నిలుపుదల నోటీసు జారీ చేశారు. ఇది చాలా అన్యాయమని, దివ్యాంగుల సంక్షేమం కోసం పాటుపడుతున్న తన పింఛన్ తొలగింపుపై అధికార యంత్రాంగం స్పందించాలని అప్పారావు కోరుతున్నారు.